షాద్ నగర్ నియోజక వర్గంలో టిఆర్ఎస్ తీరును ఎండగడతాం
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ ఆగ్రహం
తంగేడు పల్లి, గంగన్నగూడ, రావిరాల, విశ్వనాధ్ పూర్ బ్రిడ్జిల నిర్మాణాల అలసత్వంపై ఆందోళన
తంగేడుపల్లి వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా
షాద్ నగర్, : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గంలో పలు గ్రామాలకు అనుసంధానంగా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలని లేని ఎడల టిఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రజా అధికార పార్టీ అలసత్వ వైఖరిని ఎండ గడతామంటూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బుధవారం నియోజక వర్గంలోని తంగేడుపల్లి బ్రిడ్జి నిర్మాణం స్థలం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తంగేడి పల్లి, గంగన్న గూడ, చౌదరిగుడా మండలం రావిరాల, విశ్వనాథ్ పూర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు ఏమయ్యాయి? అని వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు. ప్రజలు విద్యార్థులు మహిళలు బ్రిడ్జ్ నిర్మాణాలు లేక ప్రయాణంలో అవస్థలపాలు అవుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం రాజకీయంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు భూములకు సంబంధించి ఇబ్బందులు, కిరికిరీలు పెడుతూ దందా చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగే కాంగ్రెస్ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు కేసులు పెట్టిస్తున్నారని తిరిగి భయభ్రాంతులకు గురి చేసి వారిని టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలకు ఊసే లేదని అన్నారు. నియోజక వర్గంలో పలు గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు అదేవిధంగా పెద్ద ఎత్తున నిర్మించ తలపెట్టిన లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పనులు ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను ప్రజల్లోకి వెళ్లి ఎండ కడతామని హెచ్చరించారు. తాము నిద్రపోమని, టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను నిద్ర పోనివ్వమని అన్నారు. నియోజక వర్గంలో రాబోయే రోజుల్లో రకరకాల ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐదారు గ్రామాల కార్యకర్తలు నాయకుల తోపాటు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..