అవమానం భరించలేక యువతి ఆత్మహత్య
గద్వాల రూరల్::సమీప బంధువుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవమానాన్ని భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఇటీవల గద్వాలలో న్యూడ్ కాల్స్ వ్యవహారం సద్దుమనగకముందే మరో సంఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గద్వాల రూరల్ ఎస్సై ఆనంద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన నాగమ్మ, లక్ష్మన్నల కూతురు అయిన మేఘాలత (20) మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన సమీప బంధు అయిన శివకుమార్ (24) ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె తిరస్కరించింది. విషయం ఇంట్లో తెలియడంతో మేఘలతకు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కదిరింది. దీంతో ఈ నెల 6న శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
శివకుమార్ చనిపోయిన తర్వాత మేఘాలత, శివకుమార్ ఇద్దరు కలిసి దిగిన వీడియో రూపంలో తయారు చేసి శివకుమార్ మిత్రులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. జిల్లా కేంద్రమైన గద్వాలలో డిగ్రీ చదువుతున్న మేఘాలత అవమానాన్ని భరించలేక, మానసిక శోభకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాన్న నేను నీ కూతురిని, ప్రాణం పోయినా తప్పు చేయను, 2019లో దిగిన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వారిని వదలకు నాన్న. అమ్మను, చెల్లిని తమ్ముడిని బాగా చూసుకో, ఐ లవ్ యు నాన్న, ఐ లవ్ యు అమ్మ అని లేఖ రాసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.