వికారాబాద్
మన ఊరు మనబడి, డబుల్ బెడ్ రూమ్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.
మంగళవారం కలెక్టర్ రేట్ లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ , రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన ఊరు మన బడి కింద మొదటి విడతలో 30 లక్షల లోపు చేపట్టే పనులను అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను మార్చి 31 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను కూడా నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అంకితభావంతో పనిచేసి ప్రజలకు అందేలా చూడాలని ఆయన తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో, శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. అధికారులు సరైన విధంగా నిబద్ధతో పనిచేసినట్లైతే జిల్లా యంత్రాంగం పూర్తి సహకారాన్ని అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.
సివిల్ పనులను మూడున్నర నెలల లోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
కాంట్రాక్టర్స్ నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ వంద శాతం పూర్తి అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పనులు చేపట్టేందుకు ఇప్పుడున్న సమయం అనుకూలంగా ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని మే నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రణాళిక బద్ధంగా, సమన్వయంతో కాలానుగుణంగా పనులు చేయాలని కలెక్టర్ సూచించారు. వివిధ దశల్లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణాల పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. మండల స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పనుల పురోగతి సమాచారాన్ని అందించేలా చూడాలని ఆయన తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి ఇఇ లాల్ సింగ్, పంచాయతీరాజ్ ఇఇ శ్రీనివాస్ రెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్ , డి ఎమ్ హెచ్ ఓ పాల్వన్ కుమార్, ఇంజనీరింగ్ విభాగాల డిఇలు, ఏఇ లు పాల్గొన్నారు.