ఆత్మ పరిశీలనతో ఉత్తమ నాయకులుగా ఎదగొచ్చు
– టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి : ఒక సమస్యకు పది పరిష్కార మార్గాలు ఆలోచించి, ఆత్మ పరిశీలనతో తమ తప్పులు గుర్తించి సరిదిద్దుకోగలిగితే ఉత్తమ నాయకులుగా ఎదుగుతారని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు. టీటీడీలోని ఎఈవోలు, సూపరింటెండెంట్లకు సోమవారం మహారాష్ట్రకు చెందిన ఇనిషియేటివ్స్ ఆఫ్ ఛేంజ్ సంస్థ ఆధ్వర్యంలో శ్వేత లో హార్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్ షిప్ అనే అంశంపై రెండురోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జేఈవో శ్రీమతి సదా భార్గవి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. దేవస్థానంలో సూపరింటెండెంట్ స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు మెరుగు పరుచుకోవాలని సూచించారు. కొన్ని సందర్భాల్లో మనసుతో ఆలోచించి ఉద్యోగులు, సంస్థకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సాటి ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ వారి అభిప్రాయాలను కూడా గౌరవించాలని ఆమె తెలిపారు. తమ బృందంలో పని చేస్తున్న సభ్యులు తప్పు చేసినా, వారిని నొప్పించకుండా తప్పు దిద్దికునేలా చేయడం నాయకత్వ లక్షణాల్లో ఒకటని తెలిపారు. మన టెన్షన్స్ కింది స్థాయి సిబ్బంది మీద చూపితే కార్యాలయంలో సామరస్య పూర్వక వాతావరణం, మంచి సంబంధాలు దెబ్బతింటాయన్నారు. 2020 నుంచి టీటీడీ పాలనలో వచ్చిన పెనుమార్పులను ఉద్యోగులు అందుకోవాలనే ఉద్దేశంతోనే అనేక అంశాల్లో వారికి శ్వేతలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇనిషియేటివ్స్ ఆఫ్ ఛేంజ్ సంస్థ ప్రతినిధులు శ్రీమతి విజయం కార్త, శ్రీమతి ఇస్కా ముఖర్జీ, శ్రీ కిరణ్ గాంధీ, శ్రీ వెంకటేష్ నాయకత్వ లక్షణాలకు సంబంధించి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చారు. శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి ఈ కార్యక్రమానికి సంధాన కర్త గా వ్యవహరించారు.