రాహుల్ గాంధీలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయాలి
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు
షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో సభా ప్రాంగణాల పరిశీలన
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ షాద్ నగర్ రాక
“వీర్లపల్లి శంకర్” ఆధ్వర్యంలో స్థలాలను పరిశీలించిన నేతలు
విమానాలు, హెలికాప్టర్లో గాల్లో తిరిగితే ఎవరు వెంటరారని వీలైతే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీలా పాదయాత్ర చేయాలంటూకాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో భాగంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం మీదుగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన సభ స్థలాలను బుధవారం కాంగ్రెస్ అగ్ర నాయకులు పరిశీలించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రం అదేవిధంగా కొత్తూరు ప్రాంతంలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పరిశీలించారు. సీనియర్ నేత విహెచ్, బోసుబాబు, మహేష్ గౌడ్ పొన్నం ప్రభాకర్ తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ లో మీడియాతో విహెచ్ మాట్లాడారు. కెసిఆర్ ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ హల్చల్ చేశారని అది కుదరకపోతే ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అంటూ కొత్తగానం అందుకున్నారని ఎద్దేవా చేశారు. విమానాలు హెలికాప్టర్లలో తిరిగితే ఆయన వెంట ఎవరూ రారని వీలైతే రాహుల్ గాంధీల పాదయాత్ర చేయాలంటూ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు రావడంలేదని ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పసిపిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ విధించిందని ఇంత అన్యాయం తాను ఎప్పుడు చూడలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి కుట్రలను కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేయబోతుందని అన్నారు. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల్లో రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. జనాల ఖాతాల్లో వేస్తామన్న 15 లక్షలు ఏమయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను సైతం అమ్మేస్తున్నారని విమర్శించారు. అందరూ రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తున్నారని కానీ రాహుల్ గాంధీ మాత్రం ఏ స్వార్థం లేకుండా ప్రజల సంక్షేమం కోసం పర్యటిస్తున్నారని వివరించారు. రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఆ కుటుంబానికి ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసమే ముందుకు వచ్చారని గుర్తు చేశారు. రాహుల్ పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని అందుకే ఈ కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తున్నామంటూ తెలిపారు. కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గం పర్యటించడం జరిగింది అన్నారు. పట్టణంలోని బాలాజీ టౌన్షిప్ అదేవిధంగా కొత్తూరులో మరోచోట రెండు సభ వేదిక స్థలాలను పరిశీలించామని స్పష్టం చేశారు. భారత్ జూడో యాత్రను పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, రాంరెడ్డి, అందే మోహన్, డంగు శ్రీనివాస్ యాదవ్, సుధీర్, మధు, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..