హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను చలి వణికిస్తోంది. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు చలి తీవ్రత పెరిగిపోతోంది. అయితే రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, వెచ్చని దుస్తులు ధరించాలని సూచించింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం రోజు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నాడు హైదరాబాద్ నగరంలో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం నగరంలో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2012లో ఇదే సమయంలో 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ గుర్తు చేసింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు ఉష్ణోగ్రతల వివరాలను పరిశీలిస్తే.. రాజేంద్రనగర్‌లో 11.9, సరూర్‌నగర్‌లో 12.4, సికింద్రాబాద్‌లో 12.6, రామచంద్రాపురం, పటాన్‌చెరులో 12.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి..