భగ్గుమన్న బంగారం.. బాబోయ్ ఒకేరోజు ఇంత పెరుగుదలా?

బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఏకంగా రూ.1400 మేర పెరిగి రూ.60,100కు చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.58,700 వద్ద ముగిసిన పసిడి ధర సోమవారం భారీగా పెరిగింది. ఇక ఎంఎసీఎక్స్‌పై కూడా తొలిసారి రూ.60 వేల మార్క్‌ను తాకింది. అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షితమైన బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ట్రేడర్లు మొగ్గుచూపుతుండడం ధరలకు రెక్కలొచ్చేందుకు కారణమవుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుదల, వడ్డీ రేట్లు పెంపు వంటి పరిణామాలు కూడా బంగారం భగభగలకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి విలువ పతనం కూడా ఇందుకు ఆజ్యం పోస్తోందని చెబుతున్నారు. మరోవైపు వెండి ధర సోమవారం భారీగా పెరిగింది. ఒక కేజీపై రూ.1860 మేర పెరిగి రూ.69,340కు చేరింది.

పది రోజుల్లోనే 8 శాతం పెరుగుదల..

10 రోజుల క్రితం వరకు పసిడి ధరలు ఇంచుమించుగా రూ.55,200 పలికాయి. ఆ తర్వాత స్వల్పకాలంలోనే ఏకంగా 8 శాతం మేర ర్యాలీ కనిపించింది. కీలక ఆర్థిక వ్యవస్థల్లో బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతుండడం, మరిన్ని దేశాల్లో సైతం వెలుగుచూడొచ్చన్న సంకేతాల నేపథ్యంలో పసిడి ధరలు మరింత పెరగొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్.. ఇప్పుడు యూరప్‌లో క్రెడిట్ సూయిస్ బ్యాంక్ సంక్షోభాలు బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయని ‘వెంచర్ సెక్యూరిటీస్’ కమొడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి అన్నారు. పసిడి ధరలు దేశీయంగా రూ.60 వేల మార్క్‌ను తాకడం అంతగా ఆశ్చర్యం కలిగించలేదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1980 డాలర్లు పలుకుతోందన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం భయాల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ అత్యవసర లిక్విడిటీ చర్యలు, ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకులు సైతం కీలక చర్యలకు సిద్ధమవుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణాలని ఎన్ఎస్ రామస్వామి పేర్కొన్నారు.

అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భేటీ మంగళవారం జరగనున్న నేపథ్యంలో బంగారం ధరలకు సంబంధించి వచ్చేవారం చాలా కీలకమని రిడ్డిసిద్ధి బులియన్స్ ఎండీ, సీఈవో పృథ్విరాజ్ కోఠారి విశ్లేషించారు. ఫెడరల్ రిజర్వ్ వరుసగా వడ్డీ రేట్లు పెంచుతుండడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోందని, దీంతో బంగారం ప్రయోజనం పొందనుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న విక్రయాల వెల్లువ బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేస్తోందన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!