తెలంగాణ వచ్చాకే హిందూ దేవాలయాల విచ్ఛిన్నం
యాదగిరి గుట్టను కూల్చడం వల్లే అక్కడ శక్తి పోయింది
బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎంపీ “జితేందర్ రెడ్డి” సంచలన వ్యాఖ్యలు
“జానంపేట రథశాల” జోలికి రావద్దని ప్రభుత్వానికి హెచ్చరిక
ఆర్ అండ్ బి శాఖ ప్రధాన అధికారి రవీందర్ రావుతో ఫోన్లో సంప్రదింపులు
షాద్ నగర్ లో వి.హెచ్.పి ఆందోళనకు జితేందర్ రెడ్డి మద్దతు
జానంపేట రధశాలను పరిశీలించిన బిజెపి బృందం
సిటీటైమ్స్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం హిందూ దేవాలయాలను, సంస్కృతి సంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తోందని, దీనిని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న రథశాలను ఆయన స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. బిజెపి ముఖ్య నాయకులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, యువ నాయకులు చెట్ల వెంకటేష్, ఆకుల ప్రదీప్, రుషికేశ్, వంశీ తదితరుల ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ చేపట్టిన మూడవరోజు దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలియజేస్తూ రథశాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై అభివృద్ధి పేరిట దాడి జరుగుతుందని జితేందర్ రెడ్డి విమర్శించారు.
ప్రధాన దేవాలయమైన యాదగిరిగుట్టను పునర్నిర్మాణం చేయడంతో అక్కడ కేంద్రీకృతమైన ఆధ్యాత్మిక శక్తి విచ్ఛిన్నం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ దేవాలయాలను కూల్చే పని పెట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు. ఇకపై దీనిని సహించబోమని హెచ్చరించారు. ఒక పథకం ప్రకారం రధశాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఓ వర్గానికి సంబంధించిన స్థలాలను కాపాడటానికి రథశాలకు మరోవైపు స్థలం ఉన్నప్పటికీ కూడా దానిని తొలగించాలన్న పట్టుదల ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
చారిత్రాత్మక రథసాలను కాపాడుదాం
వనపర్తి రాజధానిగా పరిపాలన కొనసాగించిన సవాయి వెంకట్ రెడ్డి 331 సంవత్సరాల క్రితం రదశాలను నిర్మించారని అన్నారు. ఫరూఖ్ నగర్-షాద్ నగర్ గ్రామాలకు ముఖద్వారంగా వెలిసిన, పూర్వం ‘జానంపేట గుళ్ళు’గా ప్రసిద్ధి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయమని అన్నారు. సప్త ఆలయ సముదాయాలు ఇక్కడ వెలిసాయని అందులో భాగంగా రధశాల ఎర్పాటు జరిగిందని వివరించారు.
రధశాల ఆలయానికి ఈశాన్య భాగంలో ఉండకూడదని అంటున్నారు. దేవాలయానికి బయటి భాగంలో రోడ్డు అవతలి వైపు ఉన్నప్పుడు ఆలయ వాస్తుకు వర్తించదని పేర్కోన్నారు. ఈ రథశాలపై ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన పోస్టర్లను అంటిస్తే వారు ఖచ్చితంగా ఓడిపోతారనేది ప్రచారంలో ఉంది అంటున్నారు మరి దేవాలయానికి అతీతమైన శక్తి ఉంది కాబట్టి పోస్టర్లు ఎందుకు వేయాలి? దీని మహత్యం ఇప్పటికైనా తెలియదా, లేదా గుర్తించడం లేదా అని ప్రశ్నించారు. జానంపేట ప్రసిద్ధికి ఈ దేవాలయం ముఖద్వారం. షాద్ నగర్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఈ రథశాల అనీ పేర్కోన్నారు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవడం ప్రజల బాధ్యత, ఈ కట్టడాలు కనుమరుగైతే చరిత్ర క్షమించదని అన్నారు.
రధశాల తొలగించాలనే ఆలోచన ఎవరిది? ఎందుకు? అనీ, రథశాల ఉండడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని స్పష్టంగా ఆధారాలతో సహా నిరూపించగలరా? అని ప్రశ్నించారు. మన చరిత్రను భావితరాలకు అప్పగించాలని పురాతన చరిత్ర మన వారసత్వ సంపదగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
రధశాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.
రధశాలను కూల్చే ప్రసక్తే లేదని అన్నారు.
ఆర్ అండ్ బి ప్రధాన అధికారి రవీందర్ రావుతో…
ఆర్ అండ్ బి రాష్ట్ర ప్రధాన అధికారి రవీందర్ రావుతో జితేందర్ రెడ్డి సంఘటన స్థలం నుండి ఫోన్ ద్వారా మాట్లాడారు. జానంపేట రధశాలను ఎట్టి పరిస్థితిలో తొలగించకూడదని అది చరిత్రకు నిదర్శనమని పేర్కొన్నారు. హైకోర్టులో స్టే కూడా లభించిందని దీనిపై అధికారులు పునరాలోచించుకోవాలని సూచించారు. అవసరమైతే రోడ్డు విస్తరణ పనులను వేరే చోట నుండి తీసుకోవాలని ఇక్కడ చాలా స్థలం ఉందని సూచించారు. అదేవిధంగా రధశాలను ఆధునికరించాలని విజ్ఞప్తి చేశారు.