ట్రాన్స్‌ఫార్మర్‌ పాడయితే.. 48 గంటల్లోగా మరమ్మతు చేయాలి

ట్రాన్స్‌ఫార్మర్‌ పాడయితే.. 48 గంటల్లోగా మరమ్మతు చేయాలి

👉లేకపోతే విద్యుత్‌ సిబ్బందికి జరిమానా

👉ఏఆర్‌ఆర్‌పై విచారణలో ఈఆర్‌సీ ఛైర్మన్‌ ఆదేశాలు

హైదరాబాద్‌: ”ఎక్కడైనా విద్యుత్‌ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌'(డీటీఆర్‌) కాలినా, పాడయినా దానిని 48 గంటల్లోగా మరమ్మతు చేసి బిగించాలి.అలా చేయలేకపోతే ఆ డీటీఆర్‌ పరిధిలో కరెంటు కనెక్షన్‌ ఉన్న వినియోగదారులకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లించాలి. ఈ సొమ్మును డీటీఆర్‌ పరిధి విద్యుత్‌ సిబ్బందికి జరిమానాగా విధించి, వారి జీతాల నుంచి వినియోగదారులకు చెల్లించాలి” అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌ శ్రీరంగారావు ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆదాయ, వ్యయాలపై వచ్చే ఏడాది(2023-24)కి సంబంధించిన ‘వార్షిక ఆదాయ అవసరాల'(ఏఆర్‌ఆర్‌) నివేదిక, 2016-22 మధ్య పెరిగిన ఖర్చులపై ఈ సంస్థలిచ్చిన ట్రూఅప్‌ ఛార్జీల నివేదికలపై శుక్రవారం జెన్‌కో సమావేశమందిరంలో ఈఆర్‌సీ వినియోగదారులతో విచారణ నిర్వహించింది. తొలుత శ్రీరంగారావు మాట్లాడుతూ.. మానవ తప్పిదాల వల్లనే విద్యుదాఘాతంతో ప్రజలు, మూగజీవాలు మరణిస్తున్నాయన్నారు. పొలాల చుట్టూ కంచెకు కరెంటు సరఫరా వల్ల ఆ తీగలు తగిలి రైతులు మరణిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ తెలంగాణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ.. పెరిగిన విద్యుత్‌ డిమాండును తీర్చడానికి కొనుగోళ్లు పెంచినట్లు చెప్పారు. డిస్కం పరిధిలోని మొత్తం కోటీ 8లక్షల కరెంటు కనెక్షన్లలో ఇళ్లకిచ్చినవే 79.92 లక్షలకు పైగా ఉన్నట్లు తెలిపారు.

💥ఆ కార్యాలయాలపై ఉపేక్ష ఎందుకు..

పేదలు విద్యుత్‌ బిల్లు కట్టడం ఆలస్యమైతే కరెంటు కట్‌ చేసే విద్యుత్‌ సిబ్బంది.. ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం ఎందుకు ఉపేక్షిస్తున్నారని తీన్మార్‌ మల్లన్న ప్రశ్నించారు. వాటి నుంచి సొమ్ము వసూలు చేయటానికి, సీఎం క్యాంపు కార్యాలయానికి, మంత్రుల నివాసాలకు విద్యుత్‌ సరఫరా ఆపేయటానికి వారికి ధైర్యం ఉందా అని ఆయన నిలదీశారు. విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాలరావు మాట్లాడుతూ సింబ్‌కార్ప్‌ కంపెనీ నుంచి యూనిట్‌ విద్యుత్‌ను రూ.8.33కి ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాలనడం సరికాదన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌కు చెందిన స్వామి జగన్మాయానంద మాట్లాడుతూ.. ఈ ఏడాది రూ.6వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలు పెంచిన డిస్కంలు.. మళ్లీ రూ.16వేల కోట్లను వసూలు చేస్తామని ట్రూఅప్‌ ఛార్జీలకు నివేదిక ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ ఆస్పత్రులకు కరెంటు ఛార్జీలు తగ్గించాలని కోరారు. ఐఐటీ పర్యవేక్షక ఇంజినీరు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రార్థన మందిరాలకు మాదిరే ఐఐటీకీ విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ ఇవ్వాలని కోరారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!