అంగరంగ వైభవంగా ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం
శ్రీ గంగా గౌరీ సమేత మరకత లింగేశ్వర ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎమ్మెల్యే దంపతులు..
వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 03, మహానంది:
మహానంది మండలంలోని గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ గంగా, గౌరీ సమేత మరకత లింగేశ్వర స్వామి, నవగ్రహా ఆలయాల వద్ద శుక్రవారం నాడు ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమంను నిర్వాహకులు కె .మస్తాన్ రావు రుత్వికుల వేద మంత్రోచ్ఛరణలచే అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈమహోత్సవానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు సతీమణి శిల్పా నాగిని రెడ్డి లు పాల్గొన్నారు.ఈ దంపతులను ఆలయ నిర్వాహకులు కనమర్లపూడి మస్తానరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి విశేష పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం రుత్వికుల వేద ఆశీర్వచనం చేయించి ఎమ్మెల్యే దంపతులకు శాలువా పూలమాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. తదనంతరం ఎమ్మెల్యే దంపతులు దర్శనార్థమై వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా తక్కువ కాలంలోనే మరకత లింగేశ్వర స్వామి గుడిని చక్కగా తీర్చిదిద్ది భక్తులకు అవసరమైన విశేష పూజలు నిర్వహిస్తూ వచ్చిన ప్రతి భక్తునికి అన్నదానం ఏర్పాటు చేయడం అనేది నిర్వాహకులు అభినందనీయులు అని అన్నారు. అంతేకాకుండా మన నంద్యాల జిల్లాలో ప్రముఖంగా నవ నందులు, నవ నరసింహ స్వామి ఆలయాలు ఉన్నాయి, వీటితోపాటు ఇక్కడ నిర్మించిన నవగ్రహాల ఆలయాలు భక్తులను ఎంతో ఆకట్టుకునే విధంగా విశేషంగా ఉన్నాయి అన్నారు. అంతేకాకుండా గంగా గౌరీ సమేత మరకత లింగేశ్వర స్వామి మరియు నవగ్రహాల ఆలయాలు పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉండడం వలన భక్తులకు ఎన్నో రకాల పూజలకు అభిషేకాలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా నిర్వాహకులు ఆలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహానంది ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, పాలక మండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, నవగ్రహ ఆలయాల నిర్వాహకులు , వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.