బి.ఎస్.ఎన్.ఎల్ సిగ్నల్స్ కోసం మరిన్ని టవర్లు పెంచాలి : తిరుపతి ఎంపి గురుమూర్తి
తిరుపతి
తిరుపతి బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన టెలికాం సలహా కమిటీ సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సెల్ టవర్ల గూర్చి చర్చించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో సిగ్నల్స్ అందక అత్యవసర సమయాలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి ప్రాంతాలను గుర్తించి త్వరితగతిన సెల్ టవర్ల ఏర్పాటు చేసి వారి ఇబ్బందులను తొలగించాలని కోరారు. నెట్వర్క్ విషయంలో కానీ, సాంకేతికత విషయంలో కానీ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ తో పోటీ పడే స్థాయికి బి.ఎస్.ఎన్.ఎల్ ఎదగాలని అందుకు అందరూ కలసి కట్టుగా పనిచేయాలని, మా వైపు నుండి ఎలాంటి సహకారం అయినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారికీ తెలియజేసారు. అలాగే తిరుపతి జిల్లా గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలోని పులికాట్ పరిసర ప్రాంతాలలో, సముద్ర తీరాన ఉన్న గ్రామాలలో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని ఈ ప్రాంతాలలో సిగ్నల్స్ పెంచేందుకు కొత్త టవర్ల నిర్మాణం చేయాలనీ కోరారు. ఈ సందర్భంగా టెలికం శాఖ అధికారులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గం పూడిరాయదొరువు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఇరకం గ్రామాలలో టవర్ల ఏర్పాటుకు విన్నపాలు అందాయని ఆ మేరకు ఇరకం గ్రామానికి సంబంధించి భూ సేకరణ పూర్తయిందని త్వరలో పూడిరాయదొరువు భూసేకరణ పూర్తి చేసి టవర్ల నిర్మాణం మొదలుపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బి.ఎస్.ఎన్.ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, టెలికం అడ్వైజరీ బోర్డు మెంబెర్స్, బి.ఎస్. ఎన్. ఎల్ లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.