తాజాగా సైబర్‌న్యూస్ నివేదిక సంచలన విషయాన్ని వెల్లడించింది. WhatsApp నుంచి పెద్ద మొత్తంలో డేటా లీక్ అయినట్టు..
వాట్సప్ యూజర్లకు షాకింగ్ న్యూస్. తాజాగా సైబర్‌న్యూస్ నివేదిక సంచలన విషయాన్ని వెల్లడించింది. WhatsApp నుంచి పెద్ద మొత్తంలో డేటా లీక్ అయినట్టు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50కోట్ల మంది యూజర్లకు సంబంధించిన వాట్సప్ నెంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
వాట్సప్(WhatsApp).. ఈ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది. అయితే.. సైబర్‌న్యూస్ వెల్లడించిన తాజా కథనం ప్రకారం.. వాట్సప్ నుంచి భారీ మొత్తంలో డేటా లీక్ అయిందట. ఓ హ్యాకర్.. 48.7కోట్ల మంది వాట్సప్ యూజర్ల ఫోన్ నెంబర్లతో కూడిన 2022 డేటాబేస్‌ను అమ్మకానికి పెడుతూ ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ప్రకటన పెట్టాడట. యూఎస్, యూకే, సౌదీ అరేబియా, భారత్‌తోపాటు దాదాపు 84 దేశాలకు చెందిన వాట్సప్(WhatsApp Data) యూజర్ల ఫోన్ నెంబర్లు హ్యాకర్ చేతికి చిక్కినట్టు పేర్కొంది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల ఫోన్ నెంబర్ల డేటాకు ఒక్కో ఒక్కో రేటును హ్యాకర్ ఫిక్స్ చేసినట్టు పేర్కొంది. ఈ డేటాను సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తే.. మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు వస్తే స్పందించొద్దని యూజర్లను కోరింది.