ప్రస్తుతం నగదు చలామణీ నానాటికీ తగ్గిపోతోంది. చిన్న టీ షాపు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్నింటా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ మోసాలు కూడా చాలా వేగంగా పెరిగిపోతున్నాయి.
ప్రస్తుతం నగదు చలామణీ నానాటికీ తగ్గిపోతోంది. చిన్న టీ షాపు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్నింటా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ మోసాలు కూడా చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ బంక్‌ల నుంచి, కిరాణా షాపుల వరకు QR కోడ్‌ను స్కాన్ చేసేసి చాలా మంది చెల్లింపులు చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో QR కోడ్ స్కామ్‌లు వేగంగా పెరుగుతున్నాయి. QR కోడ్‌లను ఆధారంగా చేసుకుని సైబర్ మోసాగాళ్లు నగదు కొట్టేస్తున్నారు.
కొన్ని దుకాణాలలో QR కోడ్‌ను మార్చి పెడుతున్నారు. వాటిని స్కాన్ చేసి చెల్లింపులు చేస్తే, మన ఖాతాలోని డబ్బులన్నీ మాయం అవుతున్నాయి. అంతేకాకుండా మన ఫోన్లలోని ఫొటోలు, మెసేజ్‌లు, ఇతర రహస్య సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతోంది. వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అందినకాడికి బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ప్రస్తుతం ఈ స్కామ్ చాలా వేగంగా విస్తరిస్తోంది. అలాంటి మోసపూరిత కోడ్‌లను స్కాన్ చేసినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల QR కోడ్‌ను స్కాన్ చేసినపుడు లోకేషన్, UPI ఐడీ, బ్యాంకు ఖాతాల వివరాలను పంపమని అడుతున్నారు.
అమాయకంగా వారు చెప్పినట్లు చేస్తే ఇక ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయినట్టే. అందుకే, QR కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, మీ ఫోన్‌లో ఏదైనా వెబ్‌సైట్‌కు సంబంధించిన విండో ఓపెన్ అయినట్టైతే జాగ్రత్తగా ఉండండి. QR కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత డబ్బులు పంపే ముందు ఒకసారి దుకాణదారుడి పేరును సరిచూసుకోండి. ఆ తర్వాతే పేమెంట్ చేయండి. అలాగే అవతలి వ్యక్తి నుంచి డబ్బును స్వీకరించడానికి మీరు ఎలాంటి UPI పిన్‌ను నమోదు చేయనవసరం లేదని తెలుసుకోండి. కొందరు ఆ తరహా మోసాలకు కూడా పాల్పడుతున్నారు.