ఓటమిని భయపడని వ్యక్తిత్వం కృష్ణది. డబ్బు పోయినా పట్టించుకోరు. కానీ అనుబంధాలకు పెద్ద పీట వేసేవారు. ఎప్పుడూ తన చుట్టూ జనం ఉండాలని.. పండగొచ్చినా, పుట్టినరోజులొచ్చినా అందరూ ఒకే చోట చేరి, కలిసి భోజనం చేయాలని కోరుకునేవారు. అలాంటి కృష్ణ చివరి రోజుల్లో కాస్త ఒంటరితనం అనుభవించారు. తాను ఎంతగానో ఇష్టపడినవాళ్లంతా ఒకొక్కరుగా వెళ్లిపోవడం ఆయన్ని బాగా కలిచి వేసింది. తన సహచరిణి, యాభై ఏళ్లుగా చేయి వదలని విజయ నిర్మల మూడేళ్ల క్రితమే కన్నుమూయడం ఆయన్ను బాగా కుంగదీసింది. ప్రతి చిన్న విషయానికీ కృష్ణ విజయ నిర్మల సలహా తీసుకొనేవారని, దాని ప్రకారమే నడుచుకొనేవారని సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా జీవితంలోంచి వెళ్లిపోవడం సూపర్ స్టార్ జీవితంలో పెద్ద వెలితిగా మారింది. 2022లో కృష్ణను వరుస విషాదాలు చుట్టిముట్టాయి. ఆయన పెద్ద కుమారుడు రమేశ్‌బాబు కేన్సర్‌తో పోరాడి ఈ ఏడాది ప్రారంభంలో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితమే.. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఒంటరితనంతో కుంగిపోయిన కృష్ణను.. మహేశ్, నమ్రత, నరేశ్ తదితరులు వీలైనంత ఎక్కువగా అంటిపెట్టుకొని ఉండేవారు. వారంతా ఆయనతో వారానికి ఒకసారైనా కలిసి భోజనం చేయడం అలవాటుగా మార్చుకొన్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆప్తుల మరణాలు కృష్ణని బాగా కృంగదీశాయని, ఇది వరకటిలా ఆయన ఉత్సాహంగా కనిపించేవారు కాదని సన్నిహితులు చెబుతున్నారు..