సినీ ప్రస్థానంలో ఆయన స్మృతులెన్నో

సినీ ప్రస్థానంలో ఆయన స్మృతులెన్నో..

తొలి సినిమా చిత్రీకరణ నగరంలోనే..

సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఆ పేరే ఓ ప్రభంజనం. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన పుట్టింది బుర్రిపాలెంలో అయినా.. ఆయన సినీ, సాధారణ జీవితంతో హైదరాబాద్‌కు విడదీయరాని బంధం ఉంది. ఆయన హీరోగా వెండి తెరపై కనిపించిన తేనె మనసులు సినిమా షూటింగ్‌ ఇక్కడే జరుపుకుంది. అభిమానుల ఆశలను వమ్ము చేసి, ఆయన కానరాని లోకాలకూ ఇక్కడి నుంచే తరలారు. ఆయనను కడసారి చూసుకునేందుకు మంగళవారం అర్ధరాత్రి వరకు అభిమానులు బారులు తీరారు. కొంత మంది రాత్రంతా అక్కడే ఉన్నారు.

హైదరాబాద్‌ సిటీ: తెలుగు సినిమా తొలి జేమ్స్‌బాండ్‌, కౌబాయ్‌గా కోట్లమంది అభిమానాన్ని సంపాదించిన సూపర్‌స్టార్‌ కృష్ణ ఉమ్మడి ఏపీ ప్రభుత్వ సహకారంతో 1983లో పద్మాలయ స్టూడియోను జూబ్లీహిల్స్‌లో నెలకొల్పారు. అందులో తనయుడు మహే్‌షబాబుతో కలిసి ‘కొడుకుదిద్దిన కాపురం’, ‘శంఖారావం’, ‘రక్తతర్పణం’ తదితర మరెన్నో తెలుగు సినిమాలతో పాటు ‘పాతాళభైరవి’, ‘హిమ్మత్‌వాలా’, ‘మావాలి’ వంటి హిందీ సినిమాలనూ చిత్రీకరించారు. కృష్ణ హీరోగా పరిచయమైన తొలి సినిమా ‘తేనె మనసులు’ (1964) షూటింగ్‌ సమయంలో సారథి స్టూడియోలోనే బస చేస్తూ, అమీర్‌పేట రోడ్లమీద కృష్ణ స్కూటర్‌, కారు డ్రైవింగ్‌ నేర్చుకున్నారని రావి కొండలరావు ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

కృష్ణ, జమున, గుమ్మడి తదితర తారాగణంతో 1966, నవంబర్‌ 14న సారథి స్టూడియోలో ‘అమాయకుడు’ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఆ చలన చిత్రంలోని ఓ సన్నివేశంలో… ‘హైదరాబాద్‌ ప్రాంతీయ జానపదాన్ని కానుకగా సమర్పిస్తున్నాం’ అంటూ ‘పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ..’ పల్లవితో స్పెషల్‌ సాంగ్‌ ఉంటుంది. ఆ సినిమాకు సంగీత దర్శకత్వం హైదరాబాదీ బండి శంకర్‌ వహిస్తే, ఈ పాట రాసింది కుత్బుల్లాపూర్‌కు చెందిన బహుభాషా పండితుడు అచ్చి వేణుగోపాలాచార్యులు. ఎల్‌.ఆర్‌ ఈశ్వరి గొంతు గీతానికి అదనపు ఆకర్షణ. కృష్ణ, విజయనిర్మల జోడీతో సీవీఆర్‌ ప్రసాద్‌ నిర్మాతగా, 1970, మార్చి12న తాపీచాణక్య దర్శకత్వంలో ప్రారంభమైన ‘విధివిలాసం’ సినిమా షూటింగ్‌తో పాటు పాటలనూ నగరంలోనే రికార్డు చేయడం అప్పుడొక సంచలనం. హైదరాబాద్‌ ఫిల్మ్‌ టాలెంట్‌ గిల్డ్‌ నేపథ్య వాద్య సంగీత సహకారంతో విజయలక్ష్మి శర్మ, మోహన్‌రాజ్‌,చ చిత్తరంజన్‌ తదితర నగర గాయనీగాయకులు పాటలు పాడారు.

నగర యవనికపై సాహసాలు..

కె. బాపయ్య దర్శకత్వంలోని ‘ఇంద్రధనస్సు’ (1978)సినిమా చిత్రీకరణ చాలా వరకు నగరంలోనే జరిగింది. తెలుగు తెరకు పోలో ఆటను చూపించిన తొలి సినిమా ఇదే అంటారు సినీ ప్రముఖులు. ఆ సినిమాలో కృష్ణ గుర్రంపై వెళుతూ, పోలో ఆడే సన్నివేశాలను సికింద్రాబాద్‌లోని పాత రేస్‌కోర్స్‌ మైదానంలో చిత్రీకరించారు. అందుకోసం ప్రత్యేకంగా 17 గుర్రాలను, కొందరు పోలో క్రీడాకారులనూ పిలిపించారు. పోలో ఆటమీద అనుభవం లేని కృష్ణ కొన్ని సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించడం చూసినవారు ఆశ్చర్య చకితులు అయినట్లు తన పుస్తకంలో వినాయకరావు ‘దేవుడు లాంటి మనిషి’ పుస్తకంలో రాశారు. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా కోసం అప్పటి లోక్‌సభ సభ్యుడు వి. హనుమంతరావు ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ బేగంపేట విమానాశ్రయంలో రోజంతా విమానం హైజాక్‌ సీన్లను చిత్రీకరించారట. పద్మాలయలో చిత్రీకరించిన ‘సింహాసనం’(1985) దేవి 70 ఎంఎంలో రోజుకు నాలుగు ఆటలు చొప్పున 105 రోజులు ఆడింది.

నిజాం కాలేజీలో..

‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చాలావరకు చింతపల్లి అడవుల్లో చిత్రీకరించారు. అందులో బ్రిటీషు ఉన్నతాధికారి రూథర్‌ఫర్డ్‌గా జగ్గయ్య ఉపయోగించిన 1912 మోడల్‌ కారును కృష్ణ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించారని వినికిడి. కృష్ణ, రజనీకాంత్‌ కలిసి నటించిన ‘ఇద్దరూ అసాధ్యులే’ సినిమా చిత్రీకరణంతా హైదరాబాద్‌, శంషాబాద్‌ పరిసరాల్లో జరిగింది. అందులోని ‘సంకురాత్రి సంబరాల జాతరోయ్‌..’ పాట కోసం శంషాబాద్‌లోని ప్రస్తుత విమానాశ్రయం పరిసరాల్లో అప్పట్లో, భారీ సెట్‌ వేశారు. మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య కుమారుడు శ్రీనివాసరెడ్డి కృష్ణ హీరోగా ‘ముఖ్యమంత్రి’ సినిమా తీశారు. 1995, ఫిబ్రవరి24న కృష్ణ కథానాయకుడిగా ‘తెలుగు వీరలేవరా’ చిత్ర ప్రారంభం నిజాం కళాశాల మైదానంలో ఓ పెద్ద వేడుకలా సాగింది. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ పాల్గొనడం అప్పుడొక పెద్ద సంచలనం.

1992 తర్వాత..

కృష్ణ 1983లో పద్మాలయ స్టూడియో నగరంలో నిర్మించినా, కొన్నాళ్ళ వరకూ ఇక్కడ నుంచి మద్రాసుకు రాకపోకలు సాగించారు. 1992 తర్వాత నగరంలోనే స్థిరపడ్డారు.

నగర రంగస్థలంపై కృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ కరువు బాధిత సహాయనిధి సేకరణ కార్యక్రమాలు 1972, ఆక్టోబర్‌ 28న ఎన్టీఆర్‌ చేతులమీదగా మద్రాసులో ప్రారంభం అయ్యాయి. సినీతారల బృందాలు వేర్వేరు జిల్లాలు తిరిగాయి. ఏఎన్నార్‌ సారథ్యంలో నవంబర్‌ 2న జింఖానా గ్రౌండ్‌లో నాటక, సంగీత ప్రదర్శన నిర్వహించారు. అందులో సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన ‘వింత మనుషులు’ నాటకం ప్రదర్శితమైంది. అలా పేదల సహాయార్థం నగర రంగస్థలంపై కృష్ణ నటించారు.

చార్మినార్‌ కాడ..

కృష్ణ, అక్కినేని కాంబినేషన్‌లో నలభై ఏళ్ల కిందట వచ్చిన ‘హేమాహేమీలు’ సినిమాలో అక్కినేని, కృష్ణ, కైకాల.. ముగ్గురి మీదా చిత్రీకరించిన ‘చార్మినార్‌ కాడ మోగింది..’’ అన్న పాటంతా చార్మినార్‌ ముంగిట చిత్రీకరించారు. ఆ పాటలో ఆనాటి మెట్రో కేఫ్‌, చార్‌కమాన్‌తో పాటు మరికొన్ని దుకాణాలను చూడొచ్చు. అందుకోసం ప్రత్యేకంగా మూడు గంటలు అనుమతి తీసుకొని అక్కడ షూటింగ్‌ పూర్తి చేసినట్లు ‘దేవుడు లాంటి మనిషి’ పుస్తకంలో ‘‘ఆంధ్రజ్యోతి’’ సీనియర్‌ సినిమా జర్నలిస్టు వినాయకరావు ప్రస్తావించారు.

మాదాపూర్‌ గుట్టల్లో యుద్ధసన్నివేశాలు..

దర్శక రత్న దాసరి ‘విశ్వనాథనాయకుడు’ చిత్రీకరణంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆ కథకు సెట్‌తో పాటు యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ మద్రాసులో అయితే సులువు, పైగా బడ్జెట్‌ తగ్గుతుందని, కొందరు సలహా ఇచ్చారు. అయినా, పట్టుపట్టి దాసరి సినిమాను హైదరాబాద్‌లో చిత్రీకరించడంతో పాటు యుద్ధ సన్నివేశాలను మాదాపూర్‌ పరిసరాల్లో నాలుగు రోజులు తీశారు. ఆ సన్నివేశాలకే అప్పట్లో రూ.40 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం.

ఆ థియేటర్లతో అనుబంధం

సూపర్‌స్టార్‌ కృష్ణకు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ సినిమా థియేటర్లతో విడదీయరాని అనుబంధం ఉంది. 1990 వరకు కూడా అక్కడి పది థియేటర్లలో ఏదో ఒక చోట ఆయన సినిమా విడుదల అయ్యేది. ముఖ్యంగా సుదర్శన్‌ 35 ఎంఎ, సుదర్శన్‌ 70ఎంఎం(ఇప్పుడు ఈ థియేటర్‌ లేదు), దేవి 70ఎంఎం థియేటర్లలో ఆయన హీరోగా నటించిన సినిమాలు దాదాపు 25 విడుదల కాగా 15 నుంచి 20 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. పాడిపంటలు సినిమా విడుదల తొలి రోజు కృష్ణ, విజయనిర్మల థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారని థియేటర్‌ యాజమాన్యం పేర్కొంది. కృష్ణ మరణ వార్త తెలియగానే అభిమానులు సంతాపం ప్రకటిస్తూ ఆర్టీసీక్రాస్‌ రోడ్‌లోని థియేటర్లకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఫాస్‌ ఫిలిం సొసైటీలో సంతాప సభ

ఫాస్‌ ఫిలిం సొసైటీ కార్యాలయంలో కృష్ణ సంతాప సభ నిర్వహించారు. సొసైటీ వ్యవస్థాపకులు డా. కె ధర్మారావు, తదితరులు నివాళి అర్పించారు. సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, ఎ. విజయకుమార్‌, కమలా ప్రసాదరావు, యుగంధర్‌, మంత్రి భుజంగరావు, అమెరికా నుంచి కలవెండి కేఎస్‌. మూర్తి ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

క్రిస్టల్‌ రెస్టారెంట్‌లో భోజనం చేశాం

1976లో పాడిపంటలు విడుదల రోజు హీరోహీరోయిన్లు కృష్ణ, విజయనిర్మల థియటర్‌కు వచ్చి ప్రేక్షకులతో కలిసి కొంతసేపు సినిమా చూశారు. భోజనం చేద్దామని ఆహ్వానించడంతో క్రాస్‌రోడ్‌లోని మా సోదర సంస్థ క్రిస్టల్‌ రెస్టారెంట్‌లో కలిసి భోజనం చేశాం.

  • సుదర్శన్‌ 35ఎంఎం ఎండి డా.నందగోపాల్‌

నానక్‌రామ్‌గూడకు తొలి హీరో..

రాయదుర్గం/మాదాపూర్‌/గచ్చిబౌలి, నవంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): సినిమా రంగం నుంచి నానక్‌రామ్‌గూడ లాంటి ప్రాంతానికి వెళ్లిన తొలి వ్యక్తి సూపర్‌ స్టార్‌ కృష్ణ. మూడు దశాబ్దాల క్రితం ఎవరూ ఉండని ఆ ప్రాంతంలో విజయనిర్మలతో కలిసి భూమిని కొన్నారు. ఇల్లు కట్టుకుని కొబ్బరి చెట్లు, పూల మొక్కల మధ్య నివాసం ఏర్పరచుకున్నారు. ఆ గ్రామం నుంచి కృష్ణ ఇంటికి ఎవరు వెళ్లినా ఆప్యాయంగా పలకరించి బాగోగులు చూసుకునే వారని, గ్రామస్థులు ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

20 ఏళ్లుగా ఆర్థిక సహాయం

అయ్యప్ప పడి పూజకు కృష్ణ దంపతులు 20 ఏళ్లుగా ఆర్థిక సహాయం అందించే వారు. ఈ ఏడాది కూడా గ్రామం నుంచి అయ్యప్ప బృందం మహా పాదయాత్ర ప్రారంభం రోజున కృష్ణ రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. ఆయన చేతుల మీదుగా ఏటా అయ్యప్ప పాటల సీడీని ఆవిష్కరించే వారు.

  • ముత్యం రెడ్డి, గురుస్వామి, నానక్‌రామ్‌గూడ

గ్రామస్థులపై ఎనలేని ప్రేమ

గ్రామానికి పెద్ద దిక్కుగా మా గుండెల్లో నిలిచిపోయారు. ఇక్కడి అమ్మవారి ఆలయాన్ని ఆ దంపతులు దత్తత తీసుకున్నారు. ప్రతి నెలా ఆలయ పూజారి వేతనంతో పాటు ధూపద్వీప నైవేద్యాలకు సొంత ఖర్చులు వెచ్చించేవారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!