మా మమ్మీని అరెస్టు చేయండి..ఎస్సైకు మూడేళ్ల బుడ్డోడు ఫిర్యాదు
మధ్యప్రదేశ్: చూసేందుకు చంటిపిల్లాడే అయినా ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వచ్చేశాడు. తన మమ్మీని అరెస్టు చేయాలంటూ 3 ఏళ్ల బుడ్డోడు మహిళా ఎస్సై వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తన మమ్మీ తనను కొట్టిందని, ఆమెను అరెస్ట్ చేయాలని కోరాడు. తన చాక్లెట్లు, క్యాండీలు దొంగతనం చేసిందని ఫిర్యాదు చేశాడు. ఎప్పుడు చాక్లెట్స్ అడిగినా కొడుతోందని కంప్లైంట్ చేశాడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న ఆ చిన్నారి క్యూట్ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కంప్లైంట్ రాస్తున్నట్లుగా చెప్పి పిల్లోడితో మాట్లాడిన ఆ మహిళా ఎస్సై.. ‘మీ తల్లి పేరేంటి?’ అనడిగితే.. ఆ బుడ్డోడు ‘మమ్మీ’ అని సమాధానం చెప్పడం మరింత ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా దేద్తాలై గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఆ చిన్నవాడు ఏదో యాదృశ్చికంగా పోలీసులు కనబడితే వచ్చి ఫిర్యాదు చేశాడనుకుంటే పొరపాటే. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని తండ్రి వెంటపడి మరీ అనుకున్నది సాధించాడు. ‘తన తల్లి మీద ఫిర్యాదు చేసేందుకు తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని బాబు ఒకటే ఏడుపు. అందుకే తీసుకొచ్చా’ అని పిల్లోడి తండ్రి చెప్పారు.‘స్నానం చేయించాక ఫౌడర్ వేసి కాటుక పెడుతుంటే, బాబు బాగా డిస్టర్బ్ చేశాడు. అందువల్ల అతడి తల్లి చిన్న దెబ్బ వేసింది. ఇక అప్పటి నుంచి ఏడుపు అందుకున్నాడు’ అని అతడి తండ్రి చెప్పుకొచ్చారు. ఇంట్లో తెగ అల్లరి చేస్తున్నాడని తెలిపారు.ఎస్సై ప్రియాంక నాయక్ ఆ పిల్లోడితో మాట్లాడుతూ సీరియస్‌గా ఫిర్యాదు రాసుకుంటుంటే.. బాలుడి మాటలకు అక్కడున్న పోలీసు సిబ్బంది తెగ నవ్వుకున్నారు. ఆ తర్వాత ‘మమ్మీ మంచిదే. నీపై ఆమెకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు’ అని బాలుడికి ఎస్సై ప్రియాంక నచ్చజెప్పారు. ఆ తర్వాత అతడు తన తండ్రితో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు.