శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ (శ్రీకాకుళం) నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, ఆర్భాటమే తప్ప ఆచరణ ఏదీ అంటూ ధర్మాన కృష్ణదాస్ పేరుతో బ్లూ మీడియాలో కథనం ప్రచురించారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ప్రజాసంతృప్తికర పాలనను అందించామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఎ కాలనీలో ఉన్న ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రహదారులన్నీ మీ పాలనలో గుంతలయ్యాయని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే మీరు మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్డును పూర్తి చేయకుండా వదిలేసిందన్నారు. తిరిగి సంబంధిత కాంట్రాక్టర్‌తో తాము చర్చించి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టామన్నారు. కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణం కోసం నిధులు మంజూరైందని క్రీడాకారులకు మోసం చేసి పాలాభిషేకాలు చేయించుకున్న పాపం ధర్మాన సోదరులకే దక్కుతుందన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తరువాత స్టేడియం పనులు జోరందుకున్నాయని రెండవ ఫ్లోర్ శ్లాబు కూడా వేశామన్నారు. అంతే కాకుండా ఖరీఫ్‌లో రైతులు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గంలోని అన్ని సాగునీటి కాలువల్లో పూడికలు తొలగింపు పనులు చేపట్టామన్నారు. ఇలా రైతుల మోముల్లో ఆనందం నింపామని చెప్పారు. శ్రీకాకుళం నగర పరిధిలోని దాదాపు 50 డివిజన్లలో కూడా డ్రైనేజీలను శుభ్రం చేయించామని చెప్పారు. వర్షం కురిసిన సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వర్షపునీటితో నిండిపోతోందన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఎత్తు చేసి ఈ ఇబ్బందులను పరిష్కరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పొన్నాం బట్టేరు వద్ద గోతకు గురైన వరద గట్టును నిర్మించినట్టు వివరించారు. వైసీపీ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, టీడీపీకి ఇటువంటి సంస్కౄతి లేదన్నారు.