అవినీతిని, అక్రమాలను నిర్మూలించాలి
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు
త్వరలోనే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కమిటీ ఏర్పాటుకు శ్రీకారం
సమాజంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రజల పైనే ఉందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలో జానంపేటలో ఓ కార్యక్రమంలో హాజరైన ఆయన పలువురు పట్టణ ప్రముఖులను ఉద్దేశించి మాట్లాడారు. సమాజంలో అవినీతి అక్రమాలు ప్రజ్వరిల్లుతుంటే మనకు ఎందుకులే అని వదిలేయడం సమంజసం కాదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాలు దోపిడీలు అవినీతి అక్రమాలు మహిళలపై అఘాయిత్యాలు ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు చెలరేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషించే సమయం ఆసన్నమైందని అన్నారు. పూర్వం సమాజంలో ఎవరైనా చెడు పని చేస్తే ఆ సమాజం అతడిని విసర్జించేదని గుర్తు చేశారు. కనీసం అతడికి గుళ్లో ప్రసాదం కూడా పెట్టేవారు కాదని చెడు పనులు చేసేవారిని అనేక కార్యకలాపాలచే కట్టుదిట్టం చేసేవారని గ్రామంలో ఎవరు తప్పు చేసినా గ్రామ పెద్దను ముందు విమర్శించే వారని, అప్పట్లో అలాంటి పరిస్థితులు ఉండేవని అన్నారు. రాను రాను సమాజంలో వింత పోకడ మొదలైందని అన్నారు. ఎవరో తప్పు చేస్తే మనకెందుకులే అని వదిలేస్తున్నారని ఇది సమాజానికి అంత శ్రేయస్కరం కాదని అన్నారు. తప్పు చేసిన వారిని దండించడానికి పోలీసులు న్యాయస్థానాలు ఉన్నాయని అయితే సమాజంలో మన వంతు పాత్ర కూడా పోషించే ఆస్కారం ఉండాలన్నారు. చెడును అన్యాయాలను అక్రమాలను మొత్తం నిర్మూలించే బాధ్యత ఒక పోలీసులకు, న్యాయస్థానానికి, ప్రభుత్వానికి కాదని ప్రజలపై కూడా ఎంతో ఉందని గుర్తు చేశారు. కుల మతాల పట్టింపులు లేని సమాజాన్ని నిర్మించాలని, ప్రజలు అందరూ సమానమే అన్న భావనను సమాజంలో కల్పించాలని అన్నారు. సమాజంలో ఎన్నో ఉన్నత విద్యలు చదువుకున్నప్పటికీ ఎందరో మేధావులు ఉన్నప్పటికీ ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి మననం చేసుకోవాలని సూచించారు. అందుకే తమ వంతు పాత్ర పోషించే విధంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేసి తమ వంతు అవినీతి అక్రమాలపై పోరాడే విధంగా చూస్తానని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ లట్టుపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలపై విద్యార్థి దశలోని వారికి బోధించే సామర్థ్యం సిద్ధం చేయాలని అన్నారు. దీనికోసం పౌరులు స్వచ్ఛందంగా కొంత సమయం వెచ్చించి వారికి ఉపోద్ఘాతం కల్పించాలని అన్నారు. సమాజంలో ప్రస్తుత నడవడిక చూస్తుంటే ఆందోళన రేకెత్తుతుందని అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి అన్యాయాలు అక్రమాలపై గొంతెత్తి చాటాలని మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాతూరి వెంకట్రావు, యాదవా చారి, జగన్మోహన్ రెడ్డి, కంచి రాజగోపాల్, వెంకట్రాంరెడ్డి, కానుగు అనంతయ్య, కిషన్, ప్రతాప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, ఖాజా పాషా కేపి, లక్కాకుల రమేష్ కుమార్, రాఘవేందర్ గౌడ్, మల్లేష్, కో ఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, బెంంది సురేందర్ రెడ్డి, మురళీమోహన్ అప్పి, ఎడ్ల సురేందర్ రెడ్డి, భూపాల్, తోకల దామోదర్ రెడ్డి, స్వాతి శివ, తదితరులు పాల్గొన్నారు..