నార్సింగి : మాజీ పీఏసీఎస్ చైర్మన్, నార్సింగి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కీ.శే తౌర్యా నాయక్, ఆయన చిన్న కుమారుడు గత సంవత్సరం జులై 22 న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం పెద్ద తాండా లో తౌర్యా నాయక్ నివాసం వద్ద ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బానాపురం కృష్ణా రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైలారం బాబు పలువురి తో కలిసి ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తౌర్యా నాయక్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిజమైన ప్రజా నాయకుడని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని, అన్నింటికీ మించి మంచి మనస్సు గల వ్యక్తని వారు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, మండలంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి ఎనలేని కృషి చేశారని, ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనబడుతుందని బాధను వ్యక్తం చేశారు. నాయక్ కుటుంబానికి తామందరము అండగా నిలుస్తామని, కుటుంబానికి తమ ప్రగాఢ సహానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా రెడ్డి, బాబు తో పాటు పెద్ద తాండా తాజా మాజీ సర్పంచ్ చత్రియా నాయక్, పెద్ద తాండా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాషా నాయక్, మాజీ వైస్ ఎంపీటీసీ ఆకుల మల్లేశం గౌడ్, రైతు కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, నర్సంపల్లి గ్రామ తాజా మాజీ వార్డు సభ్యుడు నాగరాజు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి భూపతి రాజు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.