రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 30:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి కాట్రియాల గ్రామంలో రైతులు వచ్చే వర్షాకాలం కోసం ఈ వేసవికాలంలో చేపట్టవలసిన పనుల గురించి మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిది చెరువు నల్ల మట్టిని పొలాల్లోకి తోలుకోవడం ముఖ్యంగా చెరువు నల్ల మట్టి కోసం చెరువులని తోలుకోవడం ద్వారా వచ్చే వర్షాకాలంలో కురిసేటువంటి వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉందన్నారు.అందుకోసం తప్పనిసరిగా సంబంధిత అధికారుల ద్వారా చెరువులలో మట్టి తీసుకోవడం కోసం సరైన అనుమతి తీసుకొని రైతులు చెరువు నల్ల మట్టిని పొలాలకు తరలించడం వల్ల పొలం యొక్క భూసారం పెరగడంతో పాటుగా నీటి నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుందన్నారు.అదేవిధంగా నేలలో భౌతిక మరియు రసాయన మార్పుల వల్ల ఉదజని సూచికను స్థిరంగా ఉంచడం ద్వారా పంటలలో గణనీయమైన దిగుబడి పెరిగే అవకాశం ఉందని అన్నారు. చెరువు నల్ల మట్టిలో పంటకు కావలసినటువంటి సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఉండడం ద్వారా పంటకు అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని తెలిపారు. ముఖ్యంగా పై ప్రాంతాల్లో ఉన్న పొలాల నుండి భూమి పై భాగంలో ఉన్నటువంటి సారవంతమైన మట్టి వర్షపు నీటి ద్వారా కొట్టుకొని వచ్చి చెరువుల్లో నిక్షిప్తమవుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా జంతు కలెబరాలు పంట వ్యర్థాలు పంట అవశేషాలు అన్నీ కూడా ఈ చెరువు నీటిలో నిక్షిప్తం అయ్యి సంవత్సరాల తరబడి భూమిలో కుళ్ళిపోవడం ద్వారా అధిక పోషక విలువలు కూడినటువంటి నల్ల మట్టిగా తయారవుతుందని తెలిపారు.ఈ నల్ల మట్టిని తరలించడం ద్వారా సేంద్రీయ కర్బన పదార్థం పెరిగి పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు మరియు వానపాముల యొక్క సంతతి పెరుగుతుంది రైతు స్థాయిలో అతి తక్కువ ధరకు దొరికేటువంటి సేంద్రియ ఎరువు ఈ చెరువులోని నల్ల మట్టి కావున రైతులు తమ పొలాలకు ఈ చెరువు మట్టిని తరలించడం ద్వారా అనేక లాభాలు కలిగే అవకాశం ఉందన్నారు.ఈ చెరువు నల్ల మట్టి వినియోగంపై దంతేపల్లి గ్రామంలో అదేవిధంగా విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఈ వేసవి కాలంలో చేయదగినటువంటి వ్యవసాయ పనులు వచ్చే వర్షాకాలంలో సాగు చేసే పంటలలో చీడపీడల నివారణ మరియు విత్తనాల కొనుగోలులో పాటించవలసిన జాగ్రత్తలు మరియు మెలకుల గురించి కాట్రియాల గ్రామంలో రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ తో పాటుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయి కృష్ణ తో పాటుగా రైతులు పాల్గొన్నారు.