తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్యాంపేయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం
చేవెళ్ల : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్యాంపేయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం అన్నారు. గురువారం నాడు మహాత్మా జ్యోతేబాపులే 197 వ జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలోని అయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారని పేర్కొన్నారు.
అంటరానితనం, బాల్య వివాహాల కు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని తెలిపారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదటగా తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తుందన్నారు.
బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పూలేకు నిజమైన నివాళులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, టీపీసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, చేవెళ్ల ఎంపీటీసీ గుండాల రాములు, మాజీ జిల్లా సర్పంచ్ ల అధ్యక్షులు మధుసూదన్ గుప్త, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాములు, చేవెళ్ల ఉపసర్పంచ్ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కురువ పాండు యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాయిని శ్యామ్ రాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేగరి రాములు, జంగనోళ్ళ మల్లేష్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.