విప్లవ సహచర పోరాట యోధుడు..
ఆదివాసీల అస్తిత్వం కొరకు అసువులు బాసిన ఉద్యమ కారుడు…
నా నేస్తం….. కుంజా రాము గారి వర్ధంతి సందర్బంగా..
ఎక్కడున్నావు..
ఆ పొడిసే పొద్దు నిన్ను గుర్తుచేస్తూనే ఉంది..
ఎర్రచెక్క భూమి కాలువలో పారే నీళ్లు పాశిపెయిన బువ్వలో కలుపుకొని తాగిన సంగతి గుర్తొస్తే
గుండె ఎక్కిళ్ల రోదనవుతుంది
అప్పుడప్పుడు ఆకలికి దూపకి
ఎండిపోయి ఆరిపోయిన నీ పెదాలు గుర్తొస్తే
ఈ నెలజీతం మొత్తం ఎన్విలాప్ కవరుతో సహ చించి అవతల పారేయాలనిపిస్తది.
ఎపుడో ఎన్నడో ఒకసారి..
నువు నను చూసిన గడియ గుర్తొస్తే
ఆ చూపులో ఏదో తీరిపోని తీరలేని తీర్చుకోలేని
ఆత్మీయత కనిపించేది.
బహుశా ప్రేమంటే అదేనేమో..
ఎన్నిసార్లు చంపినా మళ్ళీమళ్ళీ పుట్టడం
ఎన్నిసార్లు పడ్డ మళ్లీ మళ్ళీ లేచి నిలబడటం
ఎంత గొప్ప జీవితం..
ఇపుడు.
అగర్భ దరిద్రుల గుడసెల్లో నువు తిన్న ఎంగిలిమెతుకుల
గంజి తాగాలని ఉంది.
తండాని వదిలేసి పోయేటపుడు చెమర్చిన నీకళ్లు
నీ చెక్కళ్లని తడిపినపుడు నా రెండు చేతులతో వాటిని తుడుచేయాలనుంది.
ప్రపంచాన్ని మన ఆలింగనంలో బందీచేయాలనుంది
ఇపుడు నీదారిలో నీవెంట నడవాలనుంది..
అసలు..
బతికేదే చావడానికైనపుడు
ఈ బంధీ బతుకెందుకు
బంధూకు బతుకే బతకాలనుంది
ఆఖరికి బంధూకుతోనే చావాలనుంది.
ఇపుడు..
నీతో నడవాలనుంది..
స్వేచ్చగా ఊపిరి తీసుకోడానికైనా వదులుకోడానికైనా..
ప్రేమంటే చైతన్యం
ప్రేమంటే కట్టుబాట్ల ధ్వంసం
ప్రేమంటే మార్పు..
ప్రేమంటే పెళ్లి కాదు..
ప్రేమంటే పిల్లల్ని కనడం కాదు..
ప్రేమంటే కలిసి బతకడం కాదు..
ప్రేమంటే ఖండాంతరాలు దాటి నడవడం…
నీ నేస్తం
సీతక్క....
కుంజా రాము గారి వర్ధంతి సందర్బంగా
వారి జ్ఞాపకార్థమై
రాసిన ఈ చిన్ని కవిత… సీతక్క గారి త్యాగాలకు అంకితమిస్తూ…
---- శివ గాజుల