దివిసీమ ఉప్పెన వచ్చి నేటికీ 46 సంవత్సరాలు మండలి బుద్ధప్రసాద్

క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం స్టూడియో 10టీవీ న్యూస్

దివిసీమ ఉప్పెన వచ్చి నేటికి 46 సంవత్సరాలు పూర్తయినా ఉప్పెన భయం నేటికీ భయపెడుతూనే ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. విపత్తు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, దివి ప్రాంత పరిరక్షణకు అవసరమైన చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

దివిసీమ ఉప్పెన సంభవించి 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అవనిగడ్డ గాంధిక్షేత్రంలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో మండలి మాట్లాడుతూ 1977 నవంబర్ 19 న సంభవించిన ఉప్పెన మిగిల్చిన గుర్తులను, అనంతరం దివిసీమ పునఃనిర్మాణంలో కీలకపాత్ర వహించిన మండలి వెంకట కృష్ణారావు సేవలను మండలి బుద్ధప్రసాద్ గుర్తుచేసుకున్నారు. ఉప్పెన భాదితులకు గాంధిక్షేత్రం ఆవాసంగా మారిందని, వేలాదిమంది నిరాశ్రయులకు గాంధిక్షేత్రం ఆశ్రయం కల్పించిందని అన్నారు. ఉప్పెన బాధితులను పరామర్శించేందుకు దివిసీమ కు రాని ప్రముఖులు లేరని అన్నారు. ఇందిరాగాంధీ, మథర్ తెరిస్సా, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మొరార్జీ దేశాయ్ వంటి ఎంతోమంది ప్రముఖులు వచ్చినట్లు తెలిపారు.

*రెండుసార్లు కరకట్టల పునర్ నిర్మాణం..*
1977 ఉప్పెన అనంతరం దీవి ప్రాంత పునః నిర్మాణంలో తన తండ్రి వెంకట కృష్ణారావు విశేష కృషి చేశారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వచ్చంద సంస్థలను ఒక చోట సమీకరించి, దివి ప్రాంతాన్ని శరవేగంగా పునర్మించారని అన్నారు. ఆనాడు రామకృష్ణ మిషన్, ఆర్ ఎస్ ఎస్, టాటా సంస్థలు నిర్మించిన గృహాలు, తుఫాన్ షల్టర్లు నేడు శిథిలావస్థకు చేరాయని, వాటిని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని బుద్ధప్రసాద్ అన్నారు. 1977 ఉప్పెనకు ముందు ఏర్పడే ఉత్పాతాలు ముందుగానే అంచనా వేసి, నాటి ప్రభుత్వానికి సూచించి మండలి వెంకట కృష్ణారావు సముద్రపు కరకట్టను నిర్మించారని అన్నారు. ఆ నాడు సముద్రానికి కట్టా అంటూ కొందరు విమర్శించినప్పటికీ, ఆ కట్టని నిర్మించారని, ఉప్పెనలో ఆ కట్ట దెబ్బతినగా, అనంతరం ప్రభుత్వం కరకట్టను పునర్మించిందని చెప్పారు. 1990లో వచ్చిన ఉప్పెన తర్వాత, 2004 తర్వాత రెండుమార్లు కరకట్ట నిర్మాణం చేపట్టామని బుద్ధప్రసాద్ గుర్తుచేశారు.

*శిథిలమయిన కరకట్టలతో ఎప్పటికైనా ముప్పు..*
దివి ప్రాంతంలోని సముద్రపు కరకట్ట నేడు పూర్తి స్థాయిలో శిథిలం అయిందని, ఎక్కడికక్కడ సముద్రానికి గండ్లు పడి, ప్రమాదకరంగా తయారైందని, ఆ శిథిల కరకట్టలతో దివి ప్రాంతానికి రక్షణ ఎలా చేకూరుతుందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. పాలకాయతిప్ప మొదలు గుల్లలమోద వరకు సముద్రపు కరకట్టను ప్రభుత్వం 2004 తర్వాత పునర్మించిందని, భారీ వర్షాలకు, అనంతరం వచ్చిన చిన్నచిన్న తుఫానుల కారణంగా ఈ కరకట్ట పూర్తిగా ధ్వంసం అయిందన్నారు. ఇప్పుడు ఏ చిన్న తుఫాను వచ్చినా దివి ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు.
విపత్తుల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా పెద్దఎత్తున నిధులు కేటాయిస్తుందని, కానీ ఆ నిధులను రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో విపత్తుల నిర్వహణకు సంబంధించి సరైన ప్రతిపాదనలు పంపి వాటిని ప్రభుత్వ రాబట్టలేకపోయిందని, 2014 – 2019 ప్రాంతంలో విపత్తు నిర్వహణ కింద ఈలచెట్లదిబ్బలో, భావదేవరపల్లిలో రెండు విధాలుగా ప్రయోజనకారి అయిన తుఫాను షల్టర్లను నిర్మింపచేశామని బుద్ధప్రసాద్ గుర్తు చేశారు.
గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో దీవి ప్రాంతంలోని తుఫాను షల్టర్లను పలుచోట్ల పడగొట్టారు కానీ, కొత్త వాటి నిర్మాణం గురించి పట్టించుకోలేదన్నారు. హుదూద్ తుఫాను లాంటి విపత్తు సంభవిస్తే తీర ప్రాంత ప్రజలు ఇలా అయితే ఎక్కడ రక్షణ పొందుతారని బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పడగొట్టిన తుఫాను షల్టర్ల స్థానంలో కొత్త షల్టర్లను నిర్మించడంతో పాటు తీర గ్రామాలలో మౌళిక సదుపాయాలను కల్పించాలని బుద్ధప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాంధిక్షేత్రం కమిటీ కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్, మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, గవర్నర్ అవార్డు గ్రహీత యాసం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!