పాకాల పంట నష్ట పరిహారం త్వరగా వచ్చేలా చూస్తాం.బాధిత రైతులకు తుడా ఛైర్మన్ మోహిత్ రెడ్డి హామీ

*పాకాల పంట నష్ట పరిహారం త్వరగా వచ్చేలా చూస్తాం.బాధిత రైతులకు తుడా ఛైర్మన్ మోహిత్ రెడ్డి హామీ*

పాకాల ( స్టూడియో టెన్ న్యూస్ )‘

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ‘ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయని అధైర్యపడకండి.. మేము అండగా నిలబడతాం.. అటవీ ప్రాంతం నుంచి పంట పొలాలపైకి ఏనుగులు వచ్చే దారులను డ్రోన్ కెమెరాలతో గుర్తించి కందకాలు తవ్విస్తాం.. ఏనుగులను దారి మళ్లించేందుకు వీలుగా వీలైనంత ఎక్కువ మంది ట్రాకర్లను నియమిస్తాం.. ఇప్పటి వరకు ఏనుగలు ధ్వంసం చేసి పంటలను జిల్లా అటవీ శాఖ అధికారితో కలసి పరిశీలించడం జరిగింది.. వారందరికీ వీలైనంత త్వరగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటాం’’ అంటూ తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బాధిత రైతులకు హామీ ఇచ్చారు.
పాకాల మండలం ఇ.పాలగుట్టపల్లి, పదిపుట్లబైలు, పేరసానిపల్లి పంచాయతీల పరిధిలో గత వారం రోజులుగా ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తుడంటంతో అన్నదాతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరి, అరటి, కాయగూర పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు ఊర్లలోకి కూడా చొరబడుతుండటంతో సమాచారం తెలుసుకున్న తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అటవీ అధికారులను వెంటబెట్టుకుని శనివారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. డీఎఫ్ వో సతీష్ కుమార్ రెడ్డితో పాటు ఎఫ్ ఆర్ వో మాదవీలతలు తమ సిబ్బందిని వెంట బెట్టుకుని ఏనుగులు ధ్వంసం చేసి పంట పొలాలను సందర్శించి రైతుల వివరాలు సేకరించారు. అనంతరం ఏనుగులు వస్తున్న సమయం, ఎటువైపు నుంచి వస్తున్నాయన్న వివరాలను సేకరించి ఆయా ప్రాంతాల్లో ట్రాకర్లను ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఇ.పాలగుట్టపల్లికి చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడిన మోహిత్ రెడ్డి ఆ తర్వాత తోటపల్లి, పదిపుట్లబైలు, పెరుమాల్ గుడి ప్రాంతాల్లో రైతులను కలుసుకుని ధైర్యం చెప్పారు.

కందకాలు తవ్వించడానికి రూ.25లక్షలు

ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే మార్గాల్లో కందకాలు తవ్వించి పటిష్టమైన రైలింగ్ లను ఏర్పాటు చేయడానికి మొదటి విడతగా రూ.25లక్షలు ఖర్చు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు మోహిత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా అడవిలోపల నుంచి బయటకు వచ్చే ఏనుగుల గుంపును ముందుగానే పసిగట్టి దారి మళ్లించేందుకై డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. గత వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపును దారి మళ్లించి పంటను కాపాడుకునేందుకు రైతులు అందరూ సంఘటితంగా పోరాడాలని, ఎవ్వరికి వారు ఠపాకాయలు పేల్చి పక్క ఊర్లకు మళ్లించే ప్రయత్నం చేయరాదని సూచించారు. అలా చేయడం వల్ల ఊర్లు ఊర్లు నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అంతేకాకుండా రుచికరమైన ఆహారం దొరికితే ఏనుగులు ఆ ప్రాంతంలోనే తిష్టవేసేందుకు అవకాశం కూడా ఉంటుందన్నారు. తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఏనుగులు ఇటువైపు వచ్చిన దాఖలాలు లేనందున తమ సిబ్బంది కూడా వాటిని దారి మళ్లించలేక ఇబ్బంది పడ్డారని, అయితే వీలైనంత ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేసి పంట పొలాలపైకి రాకుండా దారి మళ్లించే చర్యలు తీసుకుంటామన్నారు. ఒంటరి ఏనుగు కనబడినప్పుడు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని, గుంపుగా వచ్చినపుడు అవి జనంపైకి వచ్చే అవకాశం ఉండదన్నారు. చివరగా ఏనుగులను దారి మళ్లించే ట్రాకర్లను అప్రమత్తం చేసి రైతులతో కలసి సమస్యను ఎదుర్కొనేలా చూడాలని సూచించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!