*హిరోహోండా, అంకురా మాస్టర్ ప్లాన్ రోడ్లు త్వరలో ప్రారంభం – కమిషనర్ హరిత ఐఏఎస్*
తిరుపతి నగరం( స్టూడియో 10 న్యూస్ )
నూతన మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా హిరోహోండా షోరూమ్ ప్రక్కనుండి వెలుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు, అదేవిధంగా అంకురా హాస్పిటల్ ప్రక్కనుండి వెలుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి అయ్యిందని, త్వరలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మిస్తున్న తిమ్మినాయుడు పాళెం మాస్టర్ ప్లాన్ రోడ్డును, అదేవిధంగా హిరోహోండా, అంకురా హాస్పిటల్ ప్రక్కన వెలుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్లను బుధవారం సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు జారీ చేస్తూ తిమ్మినాయుడు పాళెం నుండి రేణిగుంట రోడ్డుకు అనుసంధానిస్తు నిర్మిస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డును త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా హిరోహోండా, అంకురా ప్రక్కన నిర్మించిన రోడ్లో మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించేందుకు అధికారులు కాంట్రాక్టు నిర్వహకులతో సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయించాలన్నారు. ఇప్పటికే పూర్తి చేయబడి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మాస్టర్ ప్లాన్ రోడ్ల వలన నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతున్నాయని, మిగిలిన రోడ్లను కూడా త్వరగా పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచనలు జారీ చేశారు. కమిషనర్ వెంట మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.