శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంలో మీడియా పాత్ర అమోఘం
-ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి.
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 25, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో మీడియా పాత్ర ఎంతో సహకరించిందని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, పాలక మండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ఈఓ మాట్లాడుతూ మహానంది పుణ్యక్షేత్రం అభివృద్ధిలో ఆలయ అధికారులతో పాటు పాలకమండలి సభ్యుల సహకారం మరియు దాతల సహకారం తోపాటు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధి కోసం అనేకమంది దాతలు ముందుకు వస్తున్న తరుణంలో పాలక మండలి వారి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగతున్నాయి అన్నారు. దసరా శరన్నవరాత్రి పర్వదినాలకు గానూ ఆలయానికి గత సంవత్సరం 29 లక్షల 59 వేలు రాగా ఈ సంవత్సరం 39 లక్షల 73వేలు అంటే 10 లక్షల 14 వేల రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా తెలిపారు. పాలకమండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ట్రస్ట్ వచ్చాక ఆలయ పరిసరాలలో చాలా మార్పు తీసుకుని వచ్చామని ఎమ్మెల్యే సహకారంతో క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అందుకు మీడియా సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. అనంతరం పాలక మండలి చైర్మన్ ,ఆలయ ఈవో, వేద పండితులు మీడియా మిత్రులను సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలకమండలి చైర్మన్, వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు.