*ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..*
— ఎస్సై శ్రీను నాయక్..
_ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్సై శ్రీను నాయక్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.మంగళవారం రాత్రి మండల కేంద్రమైన ఆలమూరు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేక డ్రైవ్‌ను ఏర్పాటుచేసి పట్టుపడ్డ వాహనదారులకు డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు మైనర్లు ఎటువంటి అనుమతులు లేకుండా వాహనాలు నడపడాన్ని నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు మొదలుపెట్టారన్నారు. ప్రధానంగా 18 ఏళ్లు నిండకుండా వాహనాలను నడపడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు.లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పిల్లల తల్లిదండ్రులు తగుజాగ్రత్తలు వహించాలన్నారు. చిన్న వయస్సువారు, యుక్త వయసులో ఉన్నవారు మద్యంసేవించి అతివేగంగా వాహనాలను నడపడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వేగం కన్నా ప్రాణం మిన్నని,ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురైతే వాహనం నడిపిన వారే కాక ఒక్కోసారి రోడ్డుపై వెళ్తున్న వారు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు.వారు జీవించే హక్కును కాలరాయడం అవుతుందన్నారు. అలాగే క్షతగాత్రులైతే జీవితకాలం తిరిగి వాహనాలను నడపలేని స్థితి లేక అంగవైకల్యంతో బాధ పడాల్సి వస్తుందన్నారు. ఇన్సూరెన్స్ లు లేని వాహనాలకు తక్షణమే ఏర్పాటు చేసుకుని, సంబంధిత పత్రాలను వాహనంలోనే ఉంచుకోవాలన్నారు.ఎటువంటి లైసెన్సు లేకుండా వాహనాలను నడిపితే చట్టరీత్యానేరమని తెలియజేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు._