రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 10, మహానంది:
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మహానంది మండలం బోయలకుంట్ల మెట్ట వద్ద ఆటోను బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల మండలం, మిట్నాల, యాళ్ళూరు గ్రామాలకు చెందిన వారు మహానంది ఫారంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణమై వస్తుండగా, బోయలకుంట్ల మెట్ట నాలుగు కూడలి రోడ్డు వద్ద అదేసమయంలో నంద్యాల నుంచి చేపల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఆటోను ఢీకొందని తెలిపారు.ఈ ప్రమాదంలో బంగారు రాజు, లక్షి, సుబ్బమ్మ, అక్కడికక్కడే మృతి చెందారు అని, మరో ఇద్దరికి గాయాలయ్యాయని, వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్లు తెలిపారు.ఈ సమాచారం అందుకున్న మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతుల కుటుంబ సభ్యులు, అక్కడి స్థానికులు మాట్లాడుతూ బోయల కుంట్ల నాలుగు రోడ్డు కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు వేగంతో వస్తూ అదుపుతప్పి ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.