భక్తిశ్రద్ధలతో మొహరం పండుగ వేడుకలు
ఘనంగా పీర్ల నిమజ్జనం
పీర్ల ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొన ప్రజలు
స్టూడియో 10 టీవీ న్యూస్, జూలై 29, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె, బసవపురం, గాజులపల్లె మెట్ట గ్రామాలలో పెద్ద సరిగెత్తు వేడుకలు అంగరంగ వైభవంగా శనివారం ఉదయం నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు అగ్నిగుండం తొక్కుతూ మొక్కులు తీర్చుకున్నారు.భక్తులు స్వామివార్లకు పూల సూచికలు, కానుకలు సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రాత్రి నుండి ఉదయం వరకు స్థానికులు పెద్ద సరిగెత్తు పీర్ల ఊరేగింపు సందర్భంగా భక్తులు భారీసంఖ్యలో తరలిరావడంతో గ్రామం కిటకిటలాడింది.
కులమతాలకు అతీతంగా మోహరం వేడుకలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం సాయంత్రం ప్రజలందరూ కులమతాలకతీతంగా పీర్ల స్వాముల దగ్గరికి వెళ్లి బొరుగులు, చక్కెర, టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రంగురంగుల దట్టీలు, వెండి ఆభరణాలు, పూలగుమ్మటాలతో పీర్లను అలంకరించి బాజాలు,తప్పెట్ల నడుమ గ్రామేత్సవం నిర్వహించారు.పిల్లలు, పెద్దలు కోలాటాలు, ఆటపాటలతో డప్పుచప్పుళ్ల మధ్య పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. పీర్లను పురువీధుల గుండా ఊరేగించి నిమజ్జనం చేశారు.