పదవి నుండి తప్పుకుంటా… బండి సంజయ్

హైదరాబాద్‌: జూన్‌ 23
నా బిస్తర్‌ రెడీగా ఉంది. జేపీ నడ్డా ఒక్క కాల్‌ చేస్తే పదవి నుంచి తప్పకుంటా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి.ఇది కచ్చితంగా అధ్యక్ష మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సందర్భం లేకపోయినా ఇటీవల బండి సంజయ్‌ పదే పదే ‘బీజేపీ వ్యక్తి ఆధారంగా నడవదు, నిర్ణయాలు ఢిల్లీ స్థాయిలోనే జరుగుతాయి, దానికీ ఓ పద్ధతి ఉంటుంది, రాత్రికి రాత్రే నిర్ణయాలు చెప్పరు’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బండికి బలమైన సంకేతాలు ఉండటం వల్లే ఇలా మాట్లాడుతున్నారని అంతా భావిస్తున్నారు.

తాజా వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తప్పిస్తారని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతున్నది. పార్టీలో కోటరీలు ఏర్పాటు చేయడం, సీనియర్లను పక్కనబెట్టడం, తన అనుచరులకే పదవులు దక్కేలా చూడటంవంటి బండి సంజయ్‌ ఒంటెద్దు పోకడలపై ఢిల్లీ పెద్దలకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్తున్నాయని సమాచారం. బండి ప్రవర్తన వల్లే పార్టీలో చేరికలు ఆగిపోయాయని, రాష్ట్రంలో పార్టీకి పెరిగిన కాస్తో కూస్తో ఆదరణ కూడా తగ్గిపోయిందని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో బండిని తప్పించి ఈటలను అధ్యక్షుడిని చేస్తారని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈటల ఢిల్లీకి వెళ్లడం, బండి కొన్నాళ్లుగా పెద్దగా హడావుడి చేయకపోవడంవంటి పరిణామాలు దీనికి సంకేతమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు బండి వ్యాఖ్యలతో అధ్యక్షుడి మార్పు దాదాపు ఖాయమైందని అంటున్నారు.

కాంగ్రెస్‌లోకి ఆ ఇద్దరు నేతలు?

ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదేండ్ల పాలనను పూర్తిచేసుకొన్న సందర్భంగా గురువారం నిర్వహించిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉండడం ఆ పార్టీలో విభేదాలను ఎత్తిచూపుతున్నది. కార్యకర్తల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు అందరూ పాల్గొనాలని చెప్పినా వీరిద్దరూ గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈటల, కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఇది మరింత బలం చేకూర్చింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కోమటిరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టగా వ్యవహరిస్తుండగా, ఈటలకు కూడా ఇప్పుడు తత్వం బోధపడిందని అంటున్నారు.తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పడంతోనే ఢిల్లీ పెద్దలు సరిపెట్టేస్తున్నారని ఈటల వాపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నరన్న చర్చ జోరుగా సాగుతున్నది…

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!