రిటైర్డ్‌ ఎంపీడీవో హత్య కేసులో ఎస్సై పై నిర్లక్ష్యం వేటు!

ఉత్తర్వులు జారీ చేసిన సీపీ రంగనాథ్‌

హన్మకొండ :జూన్‌ 23
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధి జనగామ జిల్లా బచ్చన్నపేట ఎస్సై నవీన్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ సీపీ రంగనాథ్‌ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హత్య కేసు విషయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు. రామకృష్ణయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నలుగురు సుపారీ గ్యాంగు సభ్యులు రామకృష్ణయ్యను హత్యచేసి జనగామ సమీపంలోని చంపక్‌హిల్స్‌ ప్రాంతంలో ఓ గుంతలో పడేసి వెళ్లారు. ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే రామకృష్ణయ్య బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. జనగామ జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి భర్త అంజయ్య సుపారీ హత్యలు చేస్తున్నట్టు మృతుడి కుటుంబ సభ్యులు అనుమానంతో ముందస్తుగా పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు విషయాన్ని పెడచెవిన పెట్టారు. సుభద్ర అనే సమీప బంధువును కూడా సుపారీ గ్యాంగుతో అంజయ్య హత్య చేయించినట్లు విచారణలో తేలింది. అప్పుడు కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు బచ్చన్నపేట పోలీసుకు ఫిర్యాదు చేయగా కేసును దర్యాప్తు చేయకుండా 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఈ ఘటనలతో ఎస్సై నవీన్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలకు సీపీ రంగనాథ్‌ నిఘా విభాగం అధికారులతో సమాచారం సేకరించారు. నవీన్‌కుమార్‌ తప్పు చేసినట్టు దర్యాప్తులో తేలడంతో విధుల నుంచి తొలగిస్తున్నట్టు సీపీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనగామ డివిజన్‌ పరిధిలోని కొందరు పోలీసు అధికారులు, సిబ్బందిపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కొద్ది రోజుల్లో ఇంకా ఇద్దరిపై వేటుపడే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల్లో ప్రచారం…….

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!