“పేదలపై యుద్ధం చాలించండి … సమస్యలు పరిష్కరించండి: టీటీడీ యాజమాన్యానికి సిఐటియు విజ్ఞప్తి”
ప్రతిష్టాత్మక తిరుమల కొండపై పేదలపై యుద్ధం చాలించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టీటీడీ యాజమాన్యానికి పిలుపునిచ్చారు. టిటిడి యాజమాన్యం కార్మికులపై సాగిస్తున్న నిర్బంధాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం నాటి ఉదయం భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ రోడ్డులోని అటవీ కార్యాలయం వద్ద జరిగిన సభ, నిరసన ప్రదర్శనను ఉద్దేశించి సిఐటియు నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ తామేదో వరగబెడుతున్నట్టుగా, తిరుమల కొండపై పరిశుభ్రత పేరుతో హడావుడి చేయడం చాలించి, పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించాలని మురళి కోరారు. సాధారణ సమస్యలను కూడా పరిష్కరించలేని దుస్థితికి కారణం ఏమిటో టీటీడీ యాజమాన్యం పునః పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. తిరుమల కొండపై సులభ్ కార్మికులు, ఎఫ్ఎంఎస్ కార్మికులు కోరుతున్న కోర్కెలు సమంజసమైనవని అన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో వారికి ఇస్తున్న వేతనం చాలా తక్కువగా ఉన్న విషయాన్ని గమనించాలని అన్నారు. చాలీచాలని వేతనాలతో, కడుపు మాడ్చుకుంటున్న పేదలపై ప్రతాపం చూపటం ఏ ధర్మ శాస్త్రంలో ఉందని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం మాట అటుంచి టిటిడి పేదలపై మూకుమ్మడి యుద్ధం ప్రకటించడం ధార్మిక సంస్థ టిటిడి యాజమాన్యానికి తగదని ఆయన హితవు పలికారు. లక్ష్మీ, శ్రీనివాస కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయడమేనని పదే, పదే ప్రకటించిన టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మౌనం దాల్చడం వెనక కారణాలేమిటో తెలియజేయాలని కోరారు. యాజమాన్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కూడా అమలు పరచకుండా పేదలను దోషులుగా చిత్రీకరించడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. వేతనాలు పెంచి, పేదల హక్కులు హరించకుండా కాపాడాలని ఆయన కోరారు. తిరుమల కొండపై కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో యాజమాన్యం పూనుకోవాలని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు.
సిఐటియు జిల్లా నేత టి. సుబ్రమణ్యం ప్రసంగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు కూలీలపై కనికరం చూపకుండా గత నాలుగేళ్లుగా వేధింపులకు యాజమాన్యం పాల్పడుతున్నదని తీవ్రంగా విమర్శించారు. సమస్యలు పరిష్కరించమని కోరిన నేరానికి పోలీసు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పూనుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు రఘు, పార్థసారథి, వేణుగోపాల్, ఆర్. లక్ష్మి, బాలాజీ, బుజ్జి, తంజావూరు మురళి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయ చంద్ర, ఎస్ఎఫ్ఐ నేతలు రవి, అక్బర్ లతో పాటు సురేంద్ర, సురేష్, మునికృష్ణ, ఆనందయ్య, కేశవులు, రవికుమార్, రుక్మిణి, రవి తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
సిపిఎం మద్దతు: వి. నాగరాజు
టిటిడిలో కార్మికులు సాగిస్తున్న పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వి. నాగరాజు ప్రకటించారు. కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తిరుమల లాంటి ధార్మిక క్షేత్రంలో పేదలకు అన్యాయం జరగడం సమంజసం కాదని అన్నారు. 903 రోజులుగా పోరాడుతున్న అటవీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో టీటీడీ యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. కార్మిక క్షేత్రం అలజడులకు కేంద్రంగా మారిందని యాజమాన్య వైఫల్యమే దీనికి ప్రధాన కారణంగా ఆయన వివరించారు. టీటీడీ యాజమాన్యం తమ పట్టుదలను విడనాడి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ఎఫ్ఎంఎస్, సులభ్ కార్మికులను శ్రీనివాస కార్పొరేషన్ లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. అటవీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను లక్ష్మీ శ్రీనివాస కార్పోరేషన్ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు….
టీటీడీ యాజమాన్య తీరుకు నిరసనగా ప్రదర్శన, సభ
టీటీడీ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం నాటి ఉదయం స్థానిక హరే రామ హరే కృష్ణ రోడ్డులోని అటవీ కార్యాలయం నుంచి అన్నారావు సర్కిల్ వరకు భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి కార్మిక సమస్యలను పరిష్కరించాలని ప్రదర్శకులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. అనంతరం అన్నారావు విగ్రహం వద్ద సభను నిర్వహించారు…
టి. సుబ్రమణ్యం, సిఐటియు జిల్లా నేత తిరుపతి.