*ఆరోగ్యంపై భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉచిత వైద్య శిబిరం*
*ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం ఎంతో అవసరం జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి..!*
– ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన
– వసతులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
అనారోగ్యంతో సంభవించే అనర్థాలను అదిగమించాలంటే ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో అందరికీ ఆరోగ్యంపై భరోసా కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గొప్పగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ఆయన పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుండటంతో మరింత ఉత్సాహంగా అక్కడి వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. గత మూడు రోజులుగా దామలచెరువు పంచాయతీలో నివశించే ప్రజలకు వైద్య పరీక్షలు కొనసాగిస్తుండగా మరో రెండు రోజుల పాటు అక్కడే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మేజర్ పంచాయతీ అయిన దామలచెరువులో సుమారు పదివేల జనాభా వున్నందున అందరికీ పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. శనివారం దామలచెరువు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగే ఉచిత వైద్య శిబిరంను సందర్శించిన ఆయన అక్కడి వసతులు ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలపై చర్చించి కొంత సేపు పర్యవేక్షించారు. అనంతరం తుడా, జిల్లా అధికారులకు పలు సూచనలు అందించి ఆరోగ్య పరీక్షలు అందరికీ చేరువయ్యేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో వాలంటీర్లు ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలపై అవగాహన కల్పించడంతో అత్యధిక శాతం మంది స్వచ్ఛందంగా వైద్య శిబిరం వద్దకు చేరుకుంటున్నట్టు తెలుసుకున్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రతి ఒక్కరికీ రక్త సేకరణ, గుండె పరీక్షలు చేసి వైద్యుల వద్దకు పంపించాలని నిర్వాహకులకు సూచించారు. పంచాయతీలో ఇప్పటికే మూడు వేల మందికిపైగా ఆరోగ్య పరీక్షలు చేసుకోగా మిగతా వారిని కూడా వాలంటీర్ల ద్వారా సమాయత్తం చేయాలని పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి రోజు వైద్య శిబిరంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతున్న ఆరోగ్య పరీక్షలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
*అత్యవసరమైతే ఉపేక్షించ వద్దు*
ఉచిత వైద్య శిబిరంలో గుండె పరీక్షలు చేసుకున్న అనంతరం వచ్చే రిపోర్టుల ఆధారంగా ఎవ్వరికైనా అత్యవసర వైద్యం అందించాల్సి వస్తే ఉపేక్షించక ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తక్షణం పెద్దాసుపత్రిలకు తరలించే ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వైద్య శిబిరంలో ఏర్పాట్లు, ప్రజలకు అందించే సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచి వైద్య శిబిరం వద్దకు వచ్చేలా చూడాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బందికి ప్రత్యేకంగా అదేశించారు. వైద్య శిబిరంలో సేకరించిన రక్తం ఆలస్యం కాకుండా చంద్రగిరిలో ఏర్పాటు చేసిన రక్త పరీక్షా కేంద్రానికి తరలించే ఏర్పాట్లను ప్రివియా హెల్త్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రయివేటు కాలేజీలు, పాఠశాలలకు చెందిన వారితో చర్చించి పిల్లలు అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. చివరగా చంద్రగిరి నియోజక వర్గంలో అందరినీ ఆరోగ్య వంతులుగా చూడాలన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు.