*అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి*
*ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు*
*ప్రమాదాల నివారణ పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి.. సి. నారాయణరెడ్డి*
ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన క్యాండిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇట్టి ర్యాలీలో జిల్లా అధికారులు, పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఫైర్ స్టేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపాక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించి ప్రమాదాలు జరగకుండా అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎండాకాలంలో ఎండలు తీవ్రంగా ఉండడం వలన అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అంతేగాక జిల్లాలో హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నటడం జరుగుతుందని, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను వేసవికాలంలో కాల్చి వేయడం జరుగుతుందని, అలాగే అటవీ ప్రాంతాలలో కూడా అగ్ని ప్రమాదాలు సంభవించి చెట్లతోపాటు వన్యప్రాణులు కూడా చనిపోవడం జరుగుతుందని ఇలా జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. జిల్లాలో అగ్నిమాపక శాఖ చాలా బాగా విధులు నిర్వహిస్తుందని కొనియాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ పోలీస్ హెల్త్ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా వికారాబాద్ లో కమర్షియల్ భవనాలలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా గృహాలలో జరిగే ప్రమాదాల పట్ల గృహిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో నిర్వహించి అవగాహన కల్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, డీఎస్పీ లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.