స్టూడియో 10 టీవీ న్యూస్ ఏప్రిల్ 10
గుడివాడలో ఇప్పుడందరి దృష్టి వెనిగండ్లపైనే
పిన్నమనేని కుటుంబంతోనూ మంచి సంబంధాలు
టిడిపి ఇన్చార్జ్ రావితోనూ సక్యతగా వెనిగండ్ల
చంద్రబాబును కలిసిన తర్వాత గ్రూపులకు చెక్
ప్రతిష్ఠాత్మకంగా మారిన చంద్రబాబు పర్యటన
గుడివాడ టీడీపీలో గ్రూపు తగాదాలను అనుకూలంగా మల్చుకుంటున్న ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని విధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము తనదైన శైలిలో, ఒక ప్లాన్ ప్రకారం రాజకీయం మొదలు పెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత నాలుగైదు నెలలుగా గుడివాడ నియోజకవర్గంలో సేవా, టీడీపీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ వస్తున్న వెనిగండ్ల రాము మాత్రం చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైన తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చారు. మొదట్లో షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ 13వ తేదీన మాత్రమే జరగాల్సి ఉంది. ఆ తర్వాత చంద్రబాబును వెనిగండ్ల కలిసిన తర్వాత చంద్రబాబు టూర్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. 13వ తేదీన రోడ్ షో, బహిరంగ సభ అనంతరం రాత్రికి చంద్రబాబు గుడివాడలోనే బస చేయడం, 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం, పాస్టర్లతో సమావేశం కావడం వంటివి షెడ్యూల్ లోకి వచ్చి చేరాయి. దీంతో గుడివాడలో ఇప్పుడందరి దృష్టి వెనిగండ్ల రాముపైనే పడింది. ఇదిలా ఉండగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ముఖ్యంగా గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో పిన్నమనేని కుటుంబానికి బలమైన వర్గం ఉంది. ఇదే కుటుంబం నుండి దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు రెండుసార్లు ముదినేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏకంగా 30 ఏళ్ళ పాటు ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ గా రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆ తర్వాత ఆప్కాబ్ చైర్మన్ గా పనిచేశారు. ఇదే కుటుంబం నుండి సీనియర్ నేత పిన్నమనేని బాబ్జి కూడా టీడీపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కైకలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పిన్నమనేని కుటుంబం కైకలూరు రాజకీయాలపై దృష్టి పెట్టింది. కైకలూరు నుండి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు పిన్నమనేని కుటుంబం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబును కోరడం జరిగింది. కైకలూరు నియోజకవర్గం పరిధిలోని కొల్లేరు ప్రాంతం, లంక గ్రామాలతో పాటు గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలు, గుడివాడ పట్టణంలోనూ పిన్నమనేనికి చెక్కు చెదరని వర్గం ఉంది. కైకలూరు సీటును పిన్నమనేని వర్గానికి కేటాయిస్తే గుడివాడ సీటును గెల్చుకోవడం టీడీపీకి సునాయసమవుతుందనడంలో సందేహమే లేదు. దీన్ని ముందే గుర్తించిన వెనిగండ్ల రాము మొదటి నుండి పిన్నమనేని కుటుంబాన్ని కలుపుకుంటూనే వచ్చారు. 2024 ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ విజయానికి పిన్నమనేని వర్గం కీలకమనే అభిప్రాయంతో వెనిగండ్ల రాము ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావుతోనూ వెనిగండ్ల రాము సక్యతగానే ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు గుడివాడ పర్యటన నేపథ్యంలో ఆయనను వెనిగండ్ల కలిసిన తర్వాత టీడీపీ నేతలంతా ఒకే వేదికపై కన్పించడంతో గ్రూపు తగాదాలకు కూడా చెక్ పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. వెనిగండ్ల రాము మాత్రం టీడీపీ నేతలందరి సమన్వయంతో చంద్రబాబు గుడివాడ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.