*వికారాబాద్ జిల్లా*
*సిపిఆర్ తో నిండు ప్రాణాన్ని కాపాడుదాం….*
*ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు.*
*శిక్షణా కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన వారు అందరికి అవగాహన కల్పించటానికి కృషి చేయాలి.*
*సిపిఆర్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
ఇటీవల వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారని, వారికి సకాలంలో సిపిఆర్ నిర్వహించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలకు ఆదేశాలు ఇచ్చారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు.
ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్నవారిని సిపిఆర్ నిర్వహించడం ద్వారా రక్షించవచ్చని ఆ దిశగా ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని మంత్రి అన్నారు.
శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ డిపిఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవనశైలి ఆహారపు అలవాట్లు మారడంతో ప్రపంచవ్యాప్తంగా సడన్ కార్డియాక్ అరెస్టులు ఆకస్మిక గుండెపోటులు పెరిగాయని, గుండెపోటుకు గురైన వారికి వెంటనే కారియో పల్మనరీ రీససిటేషన్ సిపిఆర్ చేయగలిగితే ప్రాణాపాయం తప్పే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కరోనా తరువాత చిన్న వయసు వారికి కూడా గుండెపోటు వస్తున్నాయని, గుండెపోటు వచ్చిన వారికి వైద్యుని కొరకు వేచి చూడకుండా వెంటనే సిపిఆర్ నిర్వహించడం ద్వారా మరణాలు తగ్గించవచ్చని అన్నారు. ప్రాణానికి మించి ఏది లేదని, మన చుట్టుప్రక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే పది నిముషాల వరకు సిపిఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు జీవితాన్నీ, కుటుంబాన్ని కాపాడగలిగిన వారమవుతామని అన్నారు. గుండె పోటు వచ్చిన వ్యక్తికి తక్షణ ప్రథమ చికిత్స అందించడం వలన ప్రాణాలను కాపాడొచ్చని సిపిఆర్ పై అవగాహన ఉండడం ద్వారా మానవతా దృక్పధంతో సకాలంలో స్పందించి సిపిఆర్ నిర్వహించి విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఆ దిశగా శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాసుపత్రులల్లో పుట్టబోయే బిడ్డను నుండి అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నదని అన్నారు. ఆరోగ్యమే మాహాభాగ్యం అంటే సమాజానికి ఆరోగ్యకరమైన మానవ వనరులను అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని అన్నారు.
గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సర్వసభ్య సమావేశాల ద్వారా, అంగన్ వాడిల ద్వారా, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా ప్రజలకు సీపీఆర్ పై అవగాహన కల్పించాలని అన్నారు.కరోనా కాలంలో ముందున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు శిక్షణ ద్వారా సత్పలితాలు వస్తాయన్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచారంతో సిపిఆర్ అంటే ప్రజలలో చాలా మందికి అవగాహన వచ్చిందని, కానీ ఎలా చేయాలో తెలియదని ఆకస్మికంగా కుప్పకూలిన వ్యక్తిని పలకరించి, నాడి, ఊపిరి తీసుకుంటున్నారో పరిశీలించాలని, గుండె పోటు అని నిర్దారణకు వచ్చిన వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తూ ఒక నిముషంలో 100 నుండి 120 సార్లు గుండెపై రెండు చేతులతో పుష్ అప్ చేస్తూ మధ్య మధ్య ఊపిరి అందిస్తుండాలని, ఇటీవల హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారని, ఆ స్ఫూర్తితో ఫ్రంట్ లైనర్స్ కు శిక్షణ ఇవ్వడం ద్వారా కొందరి ప్రాణాలైనా కాపాడవచ్చనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మాట్లాడుతూ జిల్లాలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీ బృందాలతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సిపిఆర్ నిర్వహించే ముందు ఆ వ్యక్తి నిజంగా గుండెపోటుకు గురయ్యారా లేదా అని గుర్తించాలని సూచించారు.సిపిఆర్ పద్ధతి పై వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డిగారు, శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు,కలెక్టర్ నారాయణ్ రెడ్డి గారు,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ గారు,జడ్పీ సిఈఓ జానకి రెడ్డి గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పల్వాన్ కుమార్,డీసీసీబీ,డీసీఎంఎస్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్లు మనోహర్ రెడ్డి గారు,కృష్ణారెడ్డి గారు,సుశీల్ కుమార్ గౌడ్ గారు, జడ్పీ డిప్యూటి సిఈఓ సుభాషిణి గారు, వైద్యాధికారులు, జిల్లా అధికారులు,జడ్పీటిసి, ఎంపీపీలు, పాల్గొన్నారు.