సూరత్ (గుజరాత్): పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ‘‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎలా?’’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల కేసులో గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద ఈ శిక్ష విధించింది. ఈ సెక్షన్ల కింద గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాగా రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. కోర్టు నిర్ణయాన్ని సవాలు చేసేందుకు వీలుగా రాహుల్ శిక్షను 30 రోజలుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.
కాగా ‘‘ ఈ దొంగలందరికి ఇంటిపేరు కామన్‌గా ‘మోడీ’ ఎలా వచ్చింది?’’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాహుల్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని కొలార్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మోడీ వర్గం మండిపడింది. సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ ఫిర్యాదుపై కేసు నమోదయ్యింది. కాగా పరువు నష్టం కేసులో తీర్పు వెలువడే ముందు రాహుల్ గాంధీకి మద్దతుగా కోర్టు బయట కాంగ్రెస్ శ్రేణులు పోస్టర్లు ఏర్పాటు చేశాయి. ’ప్రజాస్వామ్యానికి మద్ధతుగా భగత్ సింగ్, సుఖ్‌దేవ్ ఫొటోలతో సూరత్ వెళ్దాం’ అని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లలిత్ మోదీలను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.