సారూ జర చూడరాదే
షాద్ నగర్ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు
షాద్ నగర్ పట్టణంలో ప్రతిరోజు వీధి కుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. మొరిగే కుక్క కరవదు అంటారు. కానీ మొరగని కుక్కలే కాదు మొరగేవి సైతం కూడా పిక్కల పట్టుకొని పీకుతున్నాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా వెంటపడి మరీ కరుస్తున్నాయి. పాదచారులనే కాదు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని సైతం వదలటం లేదు. శునకాల దెబ్బకు ఇంటి నుండి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి షాద్ నగర్ పట్టణంలో నెలకొని ఉంది. కుక్కల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. విజయ నగర్ కాలనీలో కుక్కల బెడదతో భయందోనలో స్థానికులు, విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు.
ప్రధాన రహదారుల వెంట ప్రతిరోజు కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రధాన రహదారుల సెంటర్లలో కుక్కలు పాదచారుల వెంట పడి మరీ కరుస్తున్నాయి. శునకాల గుంపుతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రధాన కూడలలో రోడ్ల వెంట కుక్కలు పడుకొని ఉంటున్నాయనే ఉద్దేశంతో పాదచారులు వెళుతుండగా ఒక్కసారిగా వారి వెంటపడి మరీ కరుస్తున్నాయి. కొన్ని కాలనీల్లో బయటకు రావాలంటేనే కుక్కల గుంపులను చూసి గడగడలాడిపోతున్నారు. ఒకప్పుడు కుక్క కాటుకి మానవుని బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో కుక్కకాటు బాధితులు కొంత గాలి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం కుక్క కాటుకి నాలుగైదు ఇంజక్షన్లు వేస్తే సరిపోతుంది. శునకాలు ఘర్షణ పడుతూ ఒక్కొక్కసారి పాదచారులపై కూడా పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ద్విచక్ర వాహనాలు దారులపై కూడా మరీ వెంటపడి కరుస్తున్నాయి. జంతు పరిరక్షణ చట్టం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరిగి వాటి వీర విహారం కూడా పెరిగిపోయింది. గతంలో మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు ఏదో ఒక నియంత్రణ చర్యలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం ఏ అధికారి కూడా నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. ఇది విజయనగర్ కాలనీ సమస్యనే కాదు అనేక కాలనీలో ఇదే తతంగం నెలకొంది..