గ్రామాలకు చేరుతున్న సాగర్ జలాలు.
మంత్రి చొరవతో కదిలిన అధికారులు.తీరుతున్న తాగునీటి ఇబ్బందులు. నియోజకవర్గం లోని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులపై రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ద్రుష్టి సారించటంతో గ్రామాలకు సాగర్ జలాలు అందుతున్నాయి. పుల్లలచెరువు మండలంలో ఇటీవల నీటి సమస్యపై ప్రజలు అధికారులకు నిరసన తెలిపారు. దీంతో సమస్య పరిష్కారం దిశగా మంత్రి సురేష్ అధికారులను ఆదేశించడంతో తక్షణ చర్యలు చేపట్టారు. ముటుకుల గ్రామంలో ఉన్న ఎస్ ఎస్ ట్యాంక్ నుంచి సాగర్ నీటిని గ్రామాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కదిలిన అధికార యంత్రాంగం పైపులైన్ల మరమ్మతులు చేపట్టి గత వారం రోజులుగా పలు గ్రామాలకు నీటి సరఫరాను చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చాపలమడుగు సి. కొత్తపల్లి వరకు సాగర్ జలాలను అందించారు. దీంతో చాలా వరకు ఆయా గ్రామాల పరిధిలో నీటి సమస్య పరిష్కారం అయిందని అధికారులు తెలిపారు. త్వరలోనే మురారిపల్లి గ్రామం వద్ద సంపు నిర్మాణం చేపట్టి ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సాగర్ జలాలు సరఫరా చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అవసరమైన చోట్ల కొత్తగా బోర్ల నిర్మాణం చేపట్టేందుకు తన నిధులను వెచ్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్రజలకు ఎక్కడా కూడా తాగునీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి సురేష్ ఈ సందర్బంగా హెచ్చరించారు.