వికారాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి శుక్రవారం బంట్వారం మండలం లోని రొంపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠదామం లతోపాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఎన్ఆర్ఇజిఎస్ నిధులతో చేపట్టిన సిసి రోడ్లను పరిశీలించారు.
ముందుగా రొంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను, వంట గదిని సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా చదువులలో విద్యార్థుల సామర్ధ్యాన్ని పరిశీలించారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో ఏం పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను సందర్శించి వండిన భోజనం నాణ్యతను పరిశీలించారు. వారానికి కనీసం రెండుసార్లు విద్యార్థులకు గుడ్లు అందించాలని, వంటలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. పాఠశాలలోని పరిసరాలలో అహల్లాదకర వాతావరణంతో పాటు చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా, ఉంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, వైద్య సదుపాయాలు బాగుంటే గ్రామాలు బాగుపడతాయన్నారు.
గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. కంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్వాంటిటీ ముఖ్యం కాదని క్వాలిటీగా పనిచేసి మంచి సేవలు అందించాలని వైద్యాధికారులను సూచించారు.
పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠ దామాన్ని సందర్శించి నిర్వహణ సక్రమంగా లేనందున సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ శంకరయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పల్లె ప్రకృతి వనాలకు ప్రజలు సాయంత్రం పూట వస్తే ఆహ్లాదకరంగా , పార్కు లాగా ఉండాలని అన్నారు. చెత్తా చెదారంతో నిండిన పల్లె ప్రకృతి వనాన్ని 15 రోజులలోపు అందంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి చెట్టుకు సాసరింగ్ చేసి ప్రతిరోజు నీరు పట్టాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన ప్రతి మొక్కను నీరు పోసి సంరక్షించాలని సూచించారు. నర్సరీలో అవసరమైన మొక్కలను పెంచాలని అన్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను అందించడం జరిగిందని వీటిని వినియోగించి ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని ఆదేశించారు. చెత్తను వేరు చేసి సెగ్రీగేషన్ షెడ్డుకు తరలించి సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించాలని అన్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ 100 శాంతం చేయాలని అన్నారు. వైకుంఠ దామాలను వినియోగంలోకి తీసుకురావాలని ఇందులో నాటిన మొక్కలకు సంరక్షించాలని, ప్రతిరోజు నీరు పోయాలని సూచించారు. గ్రామానికి తిరిగి 15 రోజుల తర్వాత వస్తానని, పరిస్థితి మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విధులకు నిర్లక్ష్యం వహించే అధికారులను ఇంకా వంద మంది నైనా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధుల క్రింద గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. మిగిలిన పనులన్నీ మార్చి మాసంతం వరకు పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 15 లోపు ఎఫ్ టి ఓ లను వెంటనే జనరేట్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
పర్యటనలో భాగంగా గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలెక్టర్ కు ఘనంగా సన్మానించారు. తమరు వచ్చిన తర్వాత ధరణి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, గ్రామంలో మరో 200 ధరణ సమస్యలు ఉన్నాయని విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని సమస్యలకు పరిష్కరించడం జరుగుతుందని, ధరణి మీ సేవ చార్జీలు తప్ప ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఇతర సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ప్రభాకర్, జడ్పిటిసి సంతోష, ఎంపీటీసీ శ్రీకాంత్ రెడ్డి, ఎం పి ఓ విజయ్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ శ్రవణ్ కుమార్, వైద్యాధికారులు డాక్టర్ సాయిబాబా, డాక్టర్ మేనక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, ఏ పీ ఓ సుధాకర్, గ్రామ కార్యదర్శి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.