*అత్యాచార ఘటనపై ‘మహిళా కమిషన్’ సీరియస్*
*- బాధితురాలిని పరామర్శించిన గజ్జల లక్ష్మి*
*- నెల్లూరు ఎస్పీని కలిసి ఘటనపై ఆరా*
*- నిందితుడు పై కఠినచర్యలకు ఆదేశం*
మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కోవూరు మండలం గుమ్మలదిన్నె ఎస్టీ కాలనీలో రెండ్రోజుల కిందట చోటుచేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి రావడంతో మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి తక్షణమే స్పందించి వెంటనే రంగంలోకి దిగారు. నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావును కలిసి అత్యాచార ఘటనపై ఆరాతీశారు. ఈమేరకు మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన ఫిర్యాదు మంగళవారం పోలీసులకు అందిందని, నిందితుడు పరారీలో ఉన్నందున ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టామని ఆమెకు ఎస్పీ వివరించారు. నిందితుడ్ని త్వరగా అరెస్టు చేసి.. అతనిపై కఠినచర్యలు తీసుకోవాలని ఎస్పీని గజ్జల లక్ష్మి కోరారు. అనంతరం ఆమె స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని ఆరాతీశారు. అదేవిధంగా బాధితురాలి తల్లిదండ్రులతో గజ్జల లక్ష్మి మాట్లాడారు. అదే కాలనీకి చెందిన పవన్ అనే వ్యక్తి తమకూతురితో మచ్చికగా ఉండి ఇంతటి అఘాయుత్యానికి ఒడిగట్టాడని వారు కన్నీటిపర్యంతమయ్యాడు. బాధితరాలికి మహిళా కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, నేరానికి పాల్పడిన పవన్ కు తగిన బుద్ధి వచ్చేలా కఠినచర్యలకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. బాలిక ఆరోగ్యపరిస్థితిని కొన్నాళ్ళు పర్యవేక్షణ చేయాలని స్థానిక మహిళా శిశుసంక్షేమ శాఖాధికారులకు సూచించారు. గజ్జల లక్ష్మి తో పాటు సఖి వన్ స్టాఫ్ సెంటర్ అడ్మినిస్ట్రేఅర్ వహనాస్, కేస్ వర్కర్ శారద, సూపర్వైజర్ సుమిత్ర, ఎంఎస్క్ఏ కె.శిరీష, అంగన్‌వాడీ వర్కర్, ధిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర సెక్రటరీ రోజారాణి, విమలమ్మ తదితర సిబ్బంది ఉన్నారు.