కనుల పండుగగా మహానందీశ్వరుని రథోత్సవం
హర హర మహాదేవ శంభో శంకర అని మారుమ్రోగిన మహానంది పుణ్యక్షేత్రం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 20, మహానంది:
ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్య క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీ కామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది.సోమవారం ఉదయం క్షేత్రంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శాస్త్ర యుక్తంగా,వేద మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలు మధ్య ప్రత్యేక పూజలను వేదపండితులు అర్చకులు నిర్వహించారు. రథశాల వద్ద వేదపండితులు రుత్వికులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.రథాంగబలి, బలిహరణహ, కొబ్బరికాయ,గుమ్మడికాయలు రథం వద్ద కొట్టి వేద మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి, మహానంది క్షేత్రంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాల అనంతరం ఆలయంలోని ప్రధాన రాజగోపురం గుండా ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీలో తీసుకొని వచ్చి రథంపై ఆశీనులు గావించారు. అనంతరం రథశాల వద్ద ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,వేద పండితులు కొబ్బరికాయలు కొట్టి అశేష జనవాహిని మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవంలో భాగంగా భక్తుల కోలాహలంతో మహానంది పుణ్యక్షేత్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది.అశేష జనవాహిని మధ్య హర హర మహాదేవ శంభో శంకర అనే పంచాక్షరి మంత్రం పఠిస్తూ భక్తులు రథాన్ని ఆలయ మాడ వీధుల గుండా లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్కభజన, కేరళ వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ అశేష జన వాహిని మధ్య క్షేత్ర మాడవీధుల్లో రథోత్సవం నయనానందకరంగా సాగింది. రథోత్సవంలో భాగంగా భక్తుల కోలాహలంతో మహానంది పుణ్యక్షేత్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది.