జై శివాజీ …జై భవాని
గొట్టిముక్కలలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి భారీ ర్యాలీ
వికారాబాద్ : ఛత్రపతి శివాజీ భవానిదేవి భక్తుడని, హిందు మత రక్షణ కోసం నడుం బిగించిన మహోన్నతుడని సర్పంచ్ వెంకటేశ్వర్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహాన్నికి పూజ చేశారు. అనంతరం గ్రామస్తులు భారీ ఎత్తున్న శివాజీ చిత్రపటాని గ్రామ పుర విధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల సర్పంచ్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ… ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారన్నారు. హిందు సామ్రాజ్య స్థాపనకు అనునిత్యం పాటు పడేవారని తెలిపారు. యువత శివాజీ మహరాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని హిందు మతాన్ని కాపాడుతూ పర మతాన్ని గౌరవించాలని సూచించారు. ఛత్రపతి మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవని, కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడన్నారు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు రమేష్, భీమేష్, శ్రీనివాస్ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, వెంకటేష్, యాదగిరి, శివ కుమార్ తదితరులు ఉన్నారు.