మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం-ఈవో చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 13, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో ఈనెల 16 నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ ఈవో కె. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం నాడు ఆలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే వేలాదిమంది భక్తుల సౌకర్యార్థమై ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, అదేవిధంగా క్యూ లైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మజ్జిగ త్రాగునీరు అందే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వాహనాల్లో వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు ఆ పార్కింగ్ స్థలాల్లో కూడా భక్తులకు త్రాగునీరు, ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల ఆధ్యాత్మిక భావన కోసం క్షేత్ర పరిధిలో రాష్ట్రస్థాయి చెక్కభజన పోటీలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల కోసం లక్ష 40 వేల లడ్డూలను తయారు చేయించి భక్తులకు కొరత లేకుండా అందే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు. ఈనెల 16వ తేదీ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ, గణపతి పూజ తో ప్రారంభమై 21వ తేదీ ధ్వజ అవరోహణతో ముగిస్తాయి అన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 18వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవము ,19వ తేదీ తెల్లవారు జామున శివపార్వతుల కళ్యాణము, రాత్రి సమయంలో పుష్ప పల్లకి సేవ, 20వ తేదీ సాయంత్రం స్వామివారి రథోత్సవం, 21వ తేదీన తెప్పోత్సవం త్రిశూల స్నానం ధ్వజ అవరోహణం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా ఆలయ ఈవో కోరారు.