బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు 2023-24కుగాను వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్ దస్త్రాలతో తన నివాసం నుంచి బయల్దేరారు. పూజల అనంతరం అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా.. అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకు వెళ్తున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలోనూ దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు. బడ్జెట్‌కు కేబినెట్‌తోపాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందని వెల్లడించారు. మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెప్పారు.