నారాయణపేట: జెడ్పీ సమావేశంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, కలెక్టర్ శ్రీహర్షతో పాటు పులువురు అధికారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. అయితే భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.50 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలోనే తమకు భోజన సౌకర్యం కల్పించడం లేదంటూ జర్నలిస్టులు నేల పై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడు జెడ్పీ సమావేశం జరిగినా భోజన సదుపాయం విషయంలో జర్నలిస్టులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు సైతం భోజనానికి నానా అవస్థలు పడి దొరికిన ఫుడ్ తిని మీటింగ్ కు హాజరయ్యారని సభ దృష్టికి తీసుకువచ్చారు. అర్ధాకలితో న్యూస్ కవరేజ్ చేయాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. అయితే వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని, ఎక్కడ సమావేశాలు జరిగినా జర్నలిస్టులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.