కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కొన్నాళ్లపాటు స్తబ్దుగా మారింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండటంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి జోరు పెరిగింది. క్రమక్రమంగా అది గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలోని 8 మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ల ఒప్పందాల లెక్క తీస్తే హైదరాబాద్ అందులో టాప్ ప్లేస్ లో ఉంది. దేశవ్యాప్తంగా 8 మెట్రో నగరాల పరిధిలో గత 9నెలల కాలంలో 1,656 ఎకరాల కొనుగోలు అభివృద్ధికి సంబంధించిన భారీ ఒప్పందాలు కుదిరాయి. అందులో హైదరాబాద్ వాటా 769.25 ఎకరాలు.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపించే ఏ ప్రముఖ కంపెనీ అయినా ముందుగా ఆయా నగరాల్లో ఉన్న అవకాశాలను గమనిస్తుంది. తక్కువ రేటుకి స్థలం వస్తున్నా కూడా అభివృద్ధిని అంచనా వేస్తారు. హైదరాబాద్ విషయంలో ఆయా కంపెనీలకు గురి బాగా కుదిరింది. స్థలాలను కొన్నా, లీజుకి తీసుకుని అభివృద్ధి చేసినా, ఆ తర్వాత భవిష్యత్తుకి ఢోకా లేదు అనే విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అందుకే హైదరాబాద్ ని వారు రియల్ హబ్ గా మార్చుకున్నారు. మాక్రోటెక్ డెవలపర్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి కార్పొరేట్ బిల్డర్లు ప్రధాన నగరాల్లో తమ జెండా పాతేస్తున్నారు.
ఢిల్లీ, బెంగళూరు, ఫూణే, చెన్నై, హైదరాబాద్, తదితర మెట్రో సిటీస్ లో నిర్మాణ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉన్నది కేవలం హైదరాబాద్ కి మాత్రమే. గత 9 నెలల కాలంలో 8 మెట్రో సిటీస్ లో.. బిల్డర్లు-భూ యజమానుల మధ్య 1,656 ఎకరాల కొనుగోలు-అభివృద్ధి ఒప్పందాలు జరిగాయి. గతేడాది కేవలం 925 ఎకరాలకు సంబంధించిన ఒప్పందాలు మాత్రమే జరిగాయి. కరోనా తర్వాత పరిస్థితులు కుదుటపడటంతో ఈ ఏడాది మార్కెట్ జోరు పెరిగింది. హైదరాబాద్ నగరంలో ఆఫీస్ స్పేస్, నివాస గృహాలకు గిరాకీ పెరగడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని అంటున్నారు ఆన్ రాక్ సంస్థ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్. ఆ సంస్థ చేపట్టిన సర్వేలో 8 మెట్రో సిటీస్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది.