మలుపులు వద్ద ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లు…మృత్యువుకు దారి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్20, మహానంది:
మహానంది మండల పరిధిలోని బోయలకుంట్ల- గాజులపల్లే జాతీయ రహదారిపై ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లు వల్ల ఎదురెదురుగా వచ్చే వాహానాలు సరిగ్గా కనబడకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలమలుపు వద్ద కంపచెట్లు, ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు రోడ్లను చుట్టేశాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది గాయాల పాలయ్యారు. కొత్త వారు మరింత జాగ్రత్త తీసుకోకుండా ఈ రోడ్ల పై ప్రయాణం చేస్తే ప్రమాదం నుంచి తప్పించుకోలేరనడంలో అతిశయోక్తి లేదు. ఈ రహదారుల్లో రోజు ప్రముఖుల ప్రయాణం ఈ రోడ్ల మీదుగా నిత్యం ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏదో ఒక పని పై ప్రయాణం చేస్తూనే వుంటారు. అయినా వారికి రోడ్లను చుట్టేసిన కంపచెట్లు, ప్రమాదకరంగా ఉన్న మూలమలుపులు కనిపించకపోవడం శోచనీయం. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.