జయలలితది..ప్లాన్ మర్డర్.!

★ మొత్తం 8 మందిపై అనుమానం
★ శశికళ చెప్పినట్లే జయకు వైద్యం
★ ఆమెపై విచారణ జరపాల్సి ఉంది
★జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ సిఫారసు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009, ‘తెలంగాణ వాచ్’కు ప్రత్యేకం)

ముఖ్యమంత్రి పదవి కోసం… నమ్మిన ‘నెచ్చెలి’ నిలువునా ప్రాణం తీసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వెంట, ఆమె వస్తువులను పట్టుకుని ముప్పై ఏళ్ళు తిరిగిన శశికళ బరి తెగించింది. జయలలితది సాధారణ మరణం కాదు. ఆమె మరణ మిస్టరీ కొంత వీడింది. మొత్తం ఎనిమిది మందిపై అనుమానం. గుండెకు శస్త్రచికిత్స చేయాలి.. అలా చేయకుండా శశికళ అడ్డు పడింది. పక్కనే ఉంటూ ‘కార్యం’ పక్కాగా చెక్కపెట్టింది. జయలలిత మరణించిన ఒకరోజు తర్వాత ఆమె మరణ ప్రకటన వెలువడింది. అంటే ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళ చాలా తపించి, తెగించిందని చెప్పకనే చెప్పే ఆధారాలను జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ బయటపెట్టేసింది.

అసలేం జరిగిందంటే..?
జయలలిత మరణం, వైద్యం విషయమై ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. కమిషన్‌ విచారణ నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా.. ప్రభుత్వం దానిని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది.

వీళ్ళే అనుమానితులు
జయలలిత మరణం, ఆమెకు అందించిన వైద్యం విషయంలో మొత్తం 8 మందిపై కమిషన్‌ అభియోగాలు మోపింది. ఆమె నెచ్చెలి శశికళ, జయ వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు కె.ఎస్‌.శివకుమార్‌, అప్పటి ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌, ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్‌, అప్పటి ముఖ్య కార్యదర్శి రామమోహన్‌రావు, అపోలో వైద్యులు డాక్టర్‌ వై.వి.సి.రెడ్డి, డాక్టర్‌ బాబూ అబ్రహం, ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డిపై విచారణ జరపాలని నివేదికలో వెల్లడించింది. వీరి తీరు అనుమానాస్పదంగా ఉందని, పలు కీలక ఆధారాలు దొరికినందున ఈ సూచనలు చేస్తున్నామని తెలిపింది. జయలలితకు అందిన వైద్యం పూర్తిగా శశికళ కనుసన్నల్లో జరిగినట్లుగా ఉందని కమిషన్‌ అనుమానాలు వ్యక్తం చేసింది.

చూపుడు వేలు.. శశికళ వైపు
‘వైద్యపరమైన నిర్ణయాలు కూడా శశికళ ఆదేశాల మేరకే తీసుకున్నారు. ఇందుకు ఆధారాలున్నాయి. జయలలిత ఆసుపత్రిలో చేరిన తర్వాత శశికళ బంధువులు 10 గదుల్లో ఉన్నారు. ముంబయి, యుకే, యూఎస్‌ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు గుండెకు సర్జరీ అవసరమని చెప్పినా.. దానిని విస్మరించడం అనుమానాస్పదం. న్యూయార్క్‌ వైద్యుడు సమిన్‌ శర్మను ఎవరు రప్పించారనే విషయంలో ఎవరూ సమాధానం ఇవ్వడంలేదు. శశికళ సన్నిహితులే ఆయనను తీసుకువచ్చారు. జయ జ్వరంతో ఉన్నా ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌ అంతా బాగుందని చెప్పారు. జయలలిత అదేరోజు రాత్రి శశికళ భుజంపై వాలి స్పృహ కోల్పోయారు. శివకుమార్‌ కూడా అక్కడున్నారు. వెంటనే ఆమెకు పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నించినప్పుడు అతని దగ్గర సమాధానంలేదు. జయ ఆసుపత్రిలో చేరకముందే తీవ్ర జ్వరంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి స్థితిలో డాక్టర్‌ శివకుమార్‌ సలహా మేరకు ఆమె పారాసిటమల్‌ మాత్రమే తీసుకునేవారు.

వైద్యంపై తీవ్ర అభ్యంతరం
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోగ్యస్థితి తెలిసి కూడా వైద్యం విషయంలో చాలా తప్పులు దొర్లాయని కమిషన్‌ ఆరోపించింది. 2015 లోనే జయలలిత గుండెలో ఎడమ జఠరిక పనిచేయలేదని తేలిందని, ఆసుపత్రిలో మాత్రం గుండె ఇబ్బందుల్ని పక్కనపెట్టి.. వారు గుర్తించిన సెప్సిస్‌ ఇన్‌ఫెక్షన్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టారని తెలిపింది. యూకే వైద్యుడు రిచర్డ్‌ బెయిలే ఆమెకు విదేశీ వైద్యం అవసరమని డాక్టర్‌ శివకుమార్‌కు సూచించి ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. కానీ దానిని పక్కనపెట్టారు. జయలలిత విషయంలో వైద్యం చాలా రహస్యంగా జరిగింది. జయలలిత చికిత్స సమయంలో ఎయిమ్స్‌ వైద్యులు వైద్యంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆసుపత్రిలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్‌ లేకుండా సాధారణ వైద్యం ఇస్తున్నట్లుగా వారు గుర్తించారు.

బాక్స్:

ఒకరోజు ముందే…
జయలలిత మరణ సమయం విషయంలోనూ చాలా వ్యత్యాసం ఉంది. అధికారులు డిసెంబరు 5న రాత్రి 11.30 గంటలకు చనిపోయినట్లు చెప్పారు. కానీ ముందురోజు మధ్యాహ్నం 3.50కి ముందే గుండెలో రక్తప్రసరణ జరగడంలేదని నివేదికల్లో ఉంది. అప్పటికే ఆమె మృతిచెంది ఉండొచ్చు. చికిత్స సమయంలో ఊపిరితిత్తుల నుంచి రోజుకు లీటరు చొప్పున ద్రవం బయటికొచ్చేదంటే ఆమె దయనీయస్థితిని అర్థం చేసుకోవచ్చు’ అని కమిషన్‌ పేర్కొంది. జయలలిత మృతి విషయంలో అప్పటి ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వం పైనా కమిషన్‌ వ్యాఖ్యలు చేసింది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!