అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఒక పాత ఇల్లు కూలి, సిలిండర్ పేలి, ఆస్తి నష్టం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరిధిలోని కొండనాగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బేగం అనే మహిళ గత నాలుగు రోజుల క్రితం వేరే ప్రాంతానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ ప్రమాదం జరిగిందని బాధితురాలు తెలిపారు. ఈ క్రమంలో ఇల్లు వర్షాలకు కూలిపోయిందని, తదుపరి ఇంట్లో వంట గ్యాస్ ప్రమాదవశత్తు పేలడం వల్ల నగదు, మూడు తులాల బంగారం, విలువైన పత్రాలు దహనం అయ్యాయని బాధితురాలు తెలిపింది.ఆ సమయంలో.. ఇల్లు కూలిపోయిన సమయంలో.. అలాగే సిలిండర్ పేలిన సందర్భంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇంట్లో ఉన్న నగదు 80 వేలు ఓ పెట్టెలో ఉంటే కాలిపోవడం, మూడు తులాల బంగారం, విలువైన పత్రాలు దహనం తో పాటు, ఇల్లు కూలి పోవడం జరిగింది. ఫోను ద్వారా పరామర్శించిన ఎమ్మెల్యే..సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పై ప్రమాద విషయం తెలియడంతో బాధితురాలుతో ఎమ్మెల్యే ఫోన్ ద్వారా మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. అలాగే బల్మూర్ మండలం ఎంపీపీ వేనెపల్లి అరుణ నరసింహారావు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ధైర్యం కల్పించారు.